https://oktelugu.com/

AP Cabinet meeting : క్యాబినెట్ భేటీ… కీలక నిర్ణయాలు, పథకాలకు పచ్చ జెండా!

కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతోంది. సంక్షేమంతో పాటు పాలనపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో మరిన్ని నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. వాటిపై ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదముద్ర తీసుకోనున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 20, 2024 / 11:17 AM IST

    AP Cabinet meeting

    Follow us on

    AP Cabinet meeting : ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే క్యాబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, జనవరి నుంచి జన్మభూమి, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిపై చర్చించనున్నారు. నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేయనున్నారు. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. సాంకేతిక కారణాలతో వాటిని రద్దుచేసి ఆ స్థానంలో కొత్త టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్మాణాలకు ఖర్చు, టెండర్ల విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను, కేంద్ర ప్రభుత్వ సాయాన్ని సహచర మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. 85 వేల కోట్ల పెట్టుబడులపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నారు.

    * పథకాల అమలుపై
    ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో కీలకమైన పథకాలకు సంబంధించి బడ్జెట్లో తాజాగా కేటాయింపులు చేశారు. ఆ పథకాల అమలుపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. జనవరి నాటికి జన్మభూమి 2 ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటు పింఛన్లను అందించే సమయానికి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. చాలా చోట్ల ఇప్పటికీ స్థానిక సంస్థలకు వైసిపి నేతలే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అటువంటి చోట రాజకీయంగా ఇబ్బందికరంగా మారకుండా జన్మభూమి కమిటీలకు క్రియాశీలక పాత్ర అప్పగిస్తారని తెలుస్తోంది. మరోవైపు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం పై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.

    * వాలంటీర్లను ఏం చేద్దాం?
    కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు వాలంటీర్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎటువంటి నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు. అయితే వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. దానిపైనే సంవత్సరం మంత్రుల అభిప్రాయాలను తీసుకుని ఫైన్ లైక్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈనెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో.. సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే కీలక అంశాలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది