Andhra Pradesh roads : ఏపీలో( Andhra Pradesh) రహదారులపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా చాలా రహదారులు అధ్వానంగా మారాయి. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మత్తు పనులకు దిగింది. చాలా రహదారుల్లో గుంతలను పూడ్చింది. అయితే శాశ్విత పనులు చేపట్టకపోవడంతో ఇప్పుడు అదే రహదారులపై గోతులు ఏర్పడ్డాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిపై టిడిపి అనుకూల మీడియాలో సైతం వ్యతిరేక కథనాలు రావడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. తక్షణం రహదారి గుంతలను పూడ్చడమే కాకుండా.. కొత్తగా రోడ్లు వేయాలని కూడా అధికారులను ఆదేశించారు. పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు వివిధ మార్గాల్లో వచ్చిన నిధులను సైతం రహదారులకు ఖర్చు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే జూన్ నాటికి వేలాది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అదే జరిగితే ఏపీకి చాలా ప్రయోజనకరం.
* అధికారంలోకి వచ్చిన వెంటనే..
గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం( Alliance government ). అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు దారుణంగా తయారయ్యాయి. గుంతల్లో రహదారులను వెతుక్కునే పరిస్థితి ఉండేది. అందుకే ముందుగా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందుకుగాను భారీగా నిధులు కేటాయించారు. కాంట్రాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులపై గుంతలను పూడ్చే పనులు పూర్తి చేశారు. అయితే గత ఆరేళ్లలో రహదారుల నిర్మాణం పూర్తిగా జరగకపోవడంతో.. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది కిందట బాగున్న రహదారుల్లో ఇప్పుడు కొత్తగా గుంతలు ఏర్పడ్డాయి. కానీ గతసారి గుంతలు కూర్చిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపులు జరగలేదు. ఇప్పుడు వాటికి సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. తద్వారా ఇప్పుడు పనులు పూర్తి చేయించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని భావిస్తోంది.
* ఆ పరిస్థితి రాకూడదని..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా రహదారులు దారుణంగా తయారయ్యాయి. వాటి పరిస్థితి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా( social media) ద్వారా బయటకు వస్తోంది. అలాగే టిడిపి అనుకూల మీడియాలో సైతం వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది కూడా రహదారులు. అందుకే వాటిపై ఎటువంటి నిర్లక్ష్యం కొనసాగించకూడదని చంద్రబాబు భావించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ రహదారుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం పై సమీక్షలు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన కాంట్రాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు జూన్ నాటికి పూర్తిస్థాయిలో రహదారులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా రూ.3000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. రోడ్లు బాగా లేవన్న మాట ఇక వినిపించకూడదు అన్నది సీఎం నిర్ణయం గా తెలుస్తోంది. జూన్లో వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా.. ఈలోపే రహదారుల నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. నిజంగా ఇది శుభ పరిణామమే ఏపీకి.