Keshinineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని అంతరంగం బయటపడడం లేదు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ రోజుకో రీతిలో కామెంట్లు చేస్తూ మీడియాకు మాత్రం మంచి మసాలా అందిస్తున్నారు. పార్టీలోని తన వ్యతిరేక శిబిరం నాయకులకు పిట్టల దొరలు, గొట్టాంగాళ్లు అంటూ సంభోదిస్తున్నారు. మహానాడులో కనిపించని ఆయన.. చంద్రబాబు ఢిల్లీ టూర్ లో మాత్రం యాక్టివ్ గా కనిపించారు. మహానాడుకు తనకు ఆహ్వానం లేదంటూనే.. ఢిల్లీ వచ్చిన అధినేతను ఆహ్వానించడం తన కనీస ధర్మం అని చెప్పుకొచ్చారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలో పార్టీ కార్యాలయ ప్రారంభానికి సైతం తనకు ఆహ్వానం లేదని చెప్పుకొచ్చారు. టీడీపీని వీడనని.. చిర్రెత్తుకొస్తే మాత్రం జెండా మార్చేస్తానని హెచ్చరికలు పంపారు. దీంతో టీడీపీలో నానిని ఎంపీగా కంటే ఫైర్ బ్రాండ్ గా చూడడం ప్రారంభించారు.
వరుసగా అనుచిత వ్యాఖ్యలతో నాని ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. గురువారం మరోసారి మీడియా ముందుకు వచ్చి టీడీపీ హైకమాండ్ కు గట్టి సంకేతాలిచ్చారు. పనిలో పనిగా ఆయన చాలా విషయాలే చెప్పేశారు. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు తనకు ఆహ్వానం రాలేదని… అందుకే వెళ్ళలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. అదే నిజమైతే మహానాడు తరువాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో నాని ఆహ్వానం పలికారు. మహానాడు వేదిక నిర్వహణలో ఎవరెవరికో పార్టీ హైకమాండ్ ఇన్ చార్జిలుగా నియమించిందని.. అయితే వాళ్ళంతా గొట్టంగాళ్ళు అంటూ కేశినేని చాలా పరుషంగా మాట్లాడారు. వారి వల్ల అయ్యేది ఏమీ లేదనేశారు.
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. దానికి కూడా తనకు ఆహ్వానం లేదని కేశినేని చెప్పడం మరో విశేషం. చంద్రబాబు ఢిల్లీ టూర్ విషయంలో కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని… తానే తెలుసుకుని బాబుకు ఆహ్వానం పలికానని గుర్తుచేశారు. అది తన బాధ్యత అని నాని చెప్పుకున్నారు. అన్ని పార్టీల్లో తనకు మిత్రులు ఉన్నారని.. అలాగని టీడీపీని వీడే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. మొత్తానికైతే తన అసంతృప్తిని బయటపెట్టే విషయంలో ప్రత్యర్థులతో పాటు హైకమాండ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నాయకత్వం మాత్రం లైట్ తీసుకుంటూ వస్తోంది. హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని.. త్వరలో నానికి నోటీసులు ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.