Homeఆంధ్రప్రదేశ్‌NDA: ఎన్డీఏలోకి కెసిఆర్, చంద్రబాబు.. నిజమెంత?

NDA: ఎన్డీఏలోకి కెసిఆర్, చంద్రబాబు.. నిజమెంత?

NDA: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ త్వరలో ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి భావిస్తోంది. సొంతంగా 370 నియోజకవర్గాలు, కూటమితో 400 పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకే ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ ఖాయమైనట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సైతం ఎన్డీఏ గూటికి రానున్నట్లు సమాచారం.అదే జరిగితే చంద్రబాబుతో పాటు కేసీఆర్ ఒకే కూటమిలో పనిచేయాల్సి ఉంటుంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు టిడిపికి జీవన్మరణ సమస్యలాంటివి. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టే విషయంలో టిడిపి సతమతమవుతోంది. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కలిసి వస్తే జగన్ ను ఎదుర్కోవడం సులువు అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బిజెపితో పొత్తు కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. వచ్చేవారం ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన, బిజెపి లతో పొత్తులో భాగంగా కోల్పోతున్న నియోజకవర్గాల ఆశావహులతో చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని చెబుతున్నారు. ఈ బుజ్జగింపుల నేపథ్యంలో ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ ఖాయమని తేలుతుంది.

ప్రస్తుతం తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. దీంతో బిఆర్ఎస్ నాయకత్వం కలవరపాటుకు గురవుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అవసరమైతే బీజేపీతో చేతులు కలపాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి.. బిఆర్ఎస్ గా విస్తరించాలని కెసిఆర్ భావించారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో.. జాతీయ పార్టీ విస్తరణ తలకిందులైంది. ఇప్పుడు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవడం అనివార్యంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే బిజెపితో చేతులు కలపడమే శరణ్యమని కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కెసిఆర్ ను బిజెపి కలుపుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

అయితే తెలంగాణ పొత్తుల విషయంలో అటు బిజెపి, ఇటు బిఆర్ఎస్ విభిన్న ప్రకటనలు చేస్తున్నాయి. బిఆర్ఎస్ తో పొత్తులు ఉండే ఛాన్స్ లేదని బిజెపి నేత బండి సంజయ్ చెబుతున్నారు. అటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ఉండదని తేల్చి చెబుతున్నారు. అయితే జాతీయస్థాయిలో ఎన్డీఏ విస్తరణకు బిజెపి నిర్ణయించింది. గతంలో వివిధ కారణాలతో ఎన్డీఏకు దూరమైన టిడిపి, జెడిఎస్ వంటి పార్టీలను చేర్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణలో అవసరాల మేరకు కెసిఆర్ ను కలుపుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చంద్రబాబు, కెసిఆర్ ఒకే తాటి పైకి వచ్చే అవకాశం ఉంది. మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular