Karanam Dharmasri: వైసీపీలో ( YSR Congress )మరో సీనియర్ కు షాక్ తగిలింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కరణం ధర్మశ్రీని( karanam Dharma Sri ) చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు జగన్. ఆయన స్థానంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ధర్మశ్రీ కి అనకాపల్లి పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమించారు. అయితే ఇది ఒక విధంగా పొమ్మన లేక పొగ పెట్టడమేనని ధర్మశ్రీ అనుచరులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ధర్మశ్రీ. కానీ భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అప్పటినుంచి నైరాశ్యంలో ఉన్నారు. అయితే పార్టీలో యాక్టివ్ గానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా పదవి నుండి తీసేసారు జగన్. ఆయన స్థానంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఇచ్చారు.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు ధర్మశ్రీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. కనీసం విస్తరణలోనైనా పదవి ఇస్తారని భావించారు. కానీ ఇవ్వక పోయేసరికి బాధపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో ధర్మశ్రీ కి గట్టి పట్టు ఉంది. అటువంటిది ధర్మశ్రీ కి ఇంచార్జ్ పదవి నుంచి తొలగించి.. గుడివాడ అమర్నాథ్కు ఇవ్వడం వైసీపీలోనే ఒక రకమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* గాజువాకలో భారీ ఓటమి
ఈ ఎన్నికల్లో గాజువాక( Gajuwaka) నుంచి పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు గుడివాడ అమర్నాథ్. అమర్నాథ్ పై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ కు ఏకంగా 95 వేల కు పైగా ఓట్ల మెజారిటీ రావడం సంచలనం రేకెత్తించింది. అయితే గుడివాడ అమర్నాథ్ భీమిలి అసెంబ్లీ ఇన్చార్జ్ పదవి ఆశించారు. అక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికి ఇన్చార్జి పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ పదవి తనకు ఇవ్వాలని గుడివాడ అమర్నాథ్ కోరుతూ వచ్చారు. కానీ జగన్ అనూహ్యంగా భీమిలికి మజ్జి శ్రీనివాసరావును తీసుకురాగా.. అమర్నాథ్ కు చోడవరం బాధ్యతలు అప్పగించారు. అక్కడ ఉన్న కరణం ధర్మశ్రీ కి పొగ పెట్టారు.
* ధర్మ శ్రీ అనుచరుల్లో ఆగ్రహం
గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath) కు సర్దుబాటు చేసేందుకు తనపై వేటు వేయడాన్ని ధర్మశ్రీ జీర్ణించుకోలేకపోతున్నారు. చోడవరం నియోజకవర్గంలో తనకంటూ సొంత క్యాడర్ ఉంది ధర్మశ్రీ కి. ఆ నియోజకవర్గాన్ని తప్పించడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు ఆయన అనుచరులు. దీనిని ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించిన తీసుకునేందుకు ధర్మ శ్రీ అయిష్టతగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయితే విశాఖలో వైసీపీలో కొత్త నియామకాలు ఆ పార్టీలో పెను గందరగోళానికి దారితీస్తున్నాయి.