AP Assembly Election Results 2024: పవన్ కి ‘కాపు’కాశారు

1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపులు బలంగా మద్దతు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కాపులు మద్దతు ఇచ్చారు. సుమారు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 7, 2024 9:52 am

AP Assembly Election Results 2024

Follow us on

AP Assembly Election Results 2024: ఏపీలో కూటమి అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. జనసేన అయితే 100 స్ట్రైక్ రేట్ తో సాలిడ్ విక్టరీ కొట్టింది. కూటమి ధాటికి వైసిపి తునాతునకలైంది. కొన్ని జిల్లాల్లో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. చివరకు జగన్ సొంత జిల్లా కడపలో సైతం చతికల పడింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా కూటమి దూసుకుపోయింది. ముఖ్యంగా వైసీపీ కాపు అభ్యర్థులు తుడుచుపెట్టుకుపోయారు. అయితే దీని వెనుక పవన్ ఫ్యాక్టర్ అధికంగా ఉంది. కాపు సామాజిక వర్గం కూటమి వెనుక బలంగా నిలబడింది. పవన్ ఇచ్చిన పిలుపుతో సంఘటితం అయ్యింది. తనకు వ్యూహం విడిచి పెట్టండి.. ఈ ఒక్కసారి కూటమికి పట్టం కట్టండి అన్న పవన్ పిలుపునకు కాపులు టర్న్ అయ్యారు. కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాపు కాశారు.

1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపులు బలంగా మద్దతు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కాపులు మద్దతు ఇచ్చారు. సుమారు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2009లో కాపులు తెలుగుదేశం పార్టీ వైపు చూశారు. కానీ అదే సమయంలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ బరిలో నిలిచింది. దీంతో తమకు రాజ్యాధికారం దక్కుతుందని భావించిన కాపులు ఏకపక్షంగా చిరంజీవికి మద్దతు తెలిపారు. 18% ఓట్లతో ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లలో గెలుపొందింది జనసేన. సుమారు 70 లక్షల ఓట్లు సాధించింది. అయితే అందులో మెజారిటీ ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పోటీలో లేకుంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచేది కాపు సామాజిక వర్గం. టిడిపి కచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూడా. అందుకే 2014లో పవన్ టిడిపికి మద్దతు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019లో పవన్ అధికారంలోకి రారని భావించిన కాపు సామాజిక వర్గం వైసీపీకి మద్దతు తెలిపింది. ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.

ఈ ఎన్నికల్లో మాత్రం పవన్ కాపుల విషయంలో ప్రత్యేక వ్యూహంతో వెళ్లారు. కాపులు సైతం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకున్నారు. కానీ తనకంటూ ఒక వ్యూహం ఉందని.. అది అమలు చేయాలంటే మీరు కూటమికి మద్దతు తెలపాలని చేతులు జోడించి పవన్ విజ్ఞప్తి చేశారు. మరో మాట లేకుండా కాపులు ఏకపక్షంగా కూటమికి మద్దతు ప్రకటించారు. వార్ వన్ సైడే అన్నట్లు ఓటు వేశారు. దాదాపు కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ఒక్క నియోజకవర్గంలో కూడా వైసిపి గెలవలేదు. అటు కాపు మంత్రులు సైతం దారుణంగా ఓడిపోయారు. కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ లభించింది. ఏకపక్షంగా కాపులు కూటమికి మద్దతు తెలిపారని అర్థమైంది. కేవలం పవన్ ఇచ్చిన పిలుపుతోనే కాపులు కూటమికి కాపు కాశారు.మరి కాపుల విషయంలో, వారి ఆకాంక్షల విషయంలో పవన్ ఎటువంటి వ్యూహంతో ఉన్నారో తెలియాలి.