Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Vs Jagan: చంద్రబాబుపై ఆ సామాజిక వర్గం తిరుగుబాటు.. జగన్ ప్లాన్ అదే

చంద్రబాబుపై ఆ సామాజిక వర్గం తిరుగుబాటు.. జగన్ ప్లాన్ అదే

Chandrababu Vs Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. చంద్రబాబును నేరుగా టార్గెట్ చేశారు. గతంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని తాను అనుసరించడం ప్రారంభించారు. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆయన బలం, బలగం రెడ్డి సామాజిక వర్గం. ఇతర సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నా.. వారిని సంఘటితం చేసేలా వ్యవహరించింది మాత్రం రెడ్డి సామాజిక వర్గం. 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం అహర్నిశలు శ్రమించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఆ సామాజిక వర్గంలో ప్రారంభం అయింది. ఎన్నికల నాటికి అది పతాక స్థాయికి చేరింది. దీంతో రెడ్డి సామాజిక వర్గం ఫుల్ సైలెంట్ అయింది. 2024 ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ విషయంలో అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.

Also Read: తాగి స్కూల్ బస్సు నడిపిన.. శ్రీ చైతన్య డ్రైవర్.. అధికారుల తనిఖీలో దారుణం

* ఎన్నికల్లో కీలకంగా మారి..
మొన్నటి ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం( kamma community ) టిడిపి కూటమికి అనుకూలంగా పనిచేసింది. గట్టిగానే ఫైట్ చేసింది. ప్రపంచ నలుమూలల స్థిరపడిన కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు ఎన్నికల్లో రంగంలోకి దిగారు. అన్ని వనరులను సమకూర్చారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న కమ్మ ప్రముఖులు సంఘటితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అధికారం నుంచి దూరం చేయాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతల విషయంలో ఉక్కు పాదం మోపుతోంది. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నోరు పారేసుకున్న వైసీపీ నేతల విషయంలో మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే అప్పట్లో చంద్రబాబుతో పాటు లోకేష్ పై ఎక్కువ మంది కమ్మ నేతలను ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వారంతా కూటమి చేతుల్లో బాధితులుగా మిగులుతున్నారు. అందుకే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడం కంటే.. చంద్రబాబుపై ఉసిగోల్పడమే వ్యూహంగా ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

* కమ్మ సామాజిక వర్గం వారిని వేధిస్తారా?
తాజాగా పల్నాడు( Palnadu) జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా గుంటూరు తో పాటు కృష్ణాజిల్లా కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్నవి. మొన్నటి ఎన్నికల్లో 90% కంటే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం టిడిపికే మొగ్గు చూపింది. అందుకే ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గంలో పునరాలోచన తేవాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాత దగ్గుబాటి సురేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి కమ్మ సామాజిక వర్గం వారిని వేధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కమ్మవారు ఉంటే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి కమ్మ సామాజిక వర్గం వారు పుట్టారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వెంటాడి వేధించి హింసిస్తున్నారని గుర్తు చేశారు. ప్రాణాలు పోయేలా అవమానిస్తున్నారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ మోహన్ విషయంలో అమానుషంగా వ్యవహరిస్తున్నారని.. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చారు. కొడాలి నాని ఏం పాపం చేశారని ఆయనపై కేసులు పెట్టారని నిలదీశారు. అబ్బయ్య చౌదరి పై కేసులు పెట్టారని.. దేవినేని అవినాష్ ను హింసిస్తున్నారని.. తలసిల రఘురాం, ఎం వివి సత్యనారాయణ, అన్నాబత్తుని శివ వంటి వారిపై వేధింపులకు దిగడం దారుణం అన్నారు. దగ్గుబాటి సురేష్ ను విశాఖలో భూ కేటాయింపులు రద్దు చేశారని వ్యాఖ్యానించారు.

* ప్రతిపక్షంలో చంద్రబాబు ఇలానే
అయితే గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు( Chandrababu) సామాజిక వర్గపరంగా టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సైతం అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఆ నలుగురు తప్ప మిగతా రెడ్లు నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో అవి రెడ్డి సామాజిక వర్గం లోకి బలంగా వెళ్లాయి. అందుకే గడిచిన ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం నేతలు పెద్దగా పనిచేయలేదు. ప్రభావం చూపలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. టిడిపి తో పాటు చంద్రబాబు పట్ల కమ్మ సామాజిక వర్గం ఆలోచన మార్చే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read: లింగయ్య మృతికి జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదట..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular