Kalamata Venkataramana Murthy: తండ్రి ఐదు సార్లు ఎమ్మెల్యే.. కుమారుడు మూడుసార్లు పోటీ చేస్తే ఒక్కసారి శాసనసభ్యుడు అయ్యారు. అటువంటి కుటుంబాన్ని పక్కనపెట్టి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చింది టిడిపి. కూటమి ప్రభంజనంలో ఆయన గెలిచారు. దీంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ కుటుంబం ఇప్పుడు పొలిటికల్ జంక్షన్ లో నిలబడింది. శ్రీకాకుళం జిల్లాలోని కలమట కుటుంబం పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు కలమట వెంకటరమణమూర్తి. మొన్ననే ఆయనను తొలగించి.. మరో నేత మొదలవలస రమేష్ కు ఆ బాధ్యతలు అప్పగించింది టిడిపి హై కమాండ్. అయితే కలమట వెంకటరమణ పార్టీ మారుతారని ప్రచారం నడుస్తుండగా.. అటువంటిదేమీ లేదని.. వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటానని చెబుతున్నారు కలమట వెంకటరమణ.
* సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం..
పాతపట్నం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కలమట మోహన రావు( kallamata Mohan Rao) . ఐదు సార్లు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు కూడా అదే ఏడాది అసెంబ్లీలో ప్రవేశించారు. నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు కలమట మోహన్ రావు. 1989, 1994, 1999, 2004లో గెలిచి రికార్డు సృష్టించారు కలమట మోహన్ రావు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కానీ ఆయన కుమారుడు కలమట వెంకటరమణమూర్తి తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తొలిసారిగా ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు వెంకటరమణ. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజులకే టిడిపిలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
* చివరి నిమిషంలో అలా..
2024 ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని భావించారు కలమట వెంకటరమణమూర్తి( Venkataramana Murthy ). కానీ అనూహ్యంగా ద్వితీయ శ్రేణి నేత మామిడి గోవిందరావు రంగంలోకి వచ్చారు. హై కమాండ్ గోవిందరావుకు టికెట్ ఇచ్చింది. అప్పట్లో జిల్లా పెద్దలు కొందరు కలమట వెంకటరమణ ను ఒప్పించి జిల్లా పార్టీ పగ్గాలు తీసుకునేలా చేశారు. అయితే మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఆయనతో వెంకటరమణ గ్యాప్ ఏర్పడింది. వెంకటరమణ కు నామినేటెడ్ పదవి దక్కకుండా చేయడంలో మామిడి గోవిందరావు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు టిడిపి అధ్యక్ష పదవి నుంచి వెంకటరమణ ను హై కమాండ్ తొలగించింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారని.. పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను టిడిపిలోనే కొనసాగుతానని.. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పాతపట్నం నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు వెంకటరమణ. చూడాలి మరి ఏం జరుగుతుందో?