Kadambari jetwani : పోలీస్ స్టేషన్లోనే ఆయనను చూసి బిగ్గరగా అరిచిన కాదంబరి జెత్వానీ.. ఏమైందంటే?

గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీస్ అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ముంబై నటి కేసులో తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించినవీరు మూల్యం చెల్లించుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : September 16, 2024 11:46 am

Kadambari jetwani

Follow us on

Kadambari Jetwani : ముంబై నటిపై వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గతవారం ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతతో పాటు పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆమె పెద్దగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబం పై ముంబై నటి కేసు పెట్టింది. ఆ కేసు నుంచి విముక్తి కలిగించాలని సదరు పారిశ్రామికవేత్త నాటి ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. దీంతో పెద్దల్లో ఒకరు పోలీస్ ఉన్నతాధికారులతో వ్యూహరచన చేశారు. ఈ క్రమంలో ముంబై నుంచి ఆ నటి తో పాటు కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు. వైసీపీ నేతలతో అక్రమ కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు. దీంతో భయపడిన నటి కేసులను విత్ డ్రా చేసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక వచ్చింది. బాధితురాలు నేరుగా వచ్చి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా వచ్చిన క్రమంలో పోలీస్ స్టేషన్లోనే ఓ ఎస్ఐని చూసి బిగ్గరగా అరిచారు.దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.ఆ ఎస్సైని చూసి ఆమె ఎందుకు అరిచారు? దాని వెనుకున్న కథ ఏంటి అన్నదానిపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

* ఆ ఎస్సై పై ఆగ్రహం
ముంబై నుంచి సదరు నటిని విజయవాడ తీసుకొచ్చే క్రమంలో ఓ ఎస్ ఐ బృందం కీలక పాత్ర పోషించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఎస్సై ప్రత్యేక విమానంలో ముంబై వెళ్ళినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులను బలవంతంగా తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆ ఎస్ఐ ని చూసిన ముంబై నటి బిగ్గరగా అరిచినట్లు తెలుస్తోంది. వేధింపులకు గురి చేయడంలో ఈ ఎస్సై పాత్ర ఉందని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఎస్సై చుట్టూ వివాదం రేగుతోంది. ఎస్సై పాత్రపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది.

* ముగ్గురు అధికారులపై వేటు
ఇంకోవైపు ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులపై వేటుపడుతోంది. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ డిజిపి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలపై చర్యలు తీసుకున్నారు.ఆ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది.ఈ ముగ్గురు ఐపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం చేశారని డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదిక అందించారు.దీంతో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదు అని కూడా ఆదేశించారు.

* చురుగ్గా విచారణ
ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఎసిపి స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ఓ సిట్ ఏర్పాటు చేశారు. నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులను సిట్ ప్రశ్నించింది. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. దీనిపై ప్రాథమిక నివేదికను తయారుచేసి డిజిపి కి అందించారు. ఆయన ప్రభుత్వానికి నివేదించారు. ఈ నివేదిక ప్రకారమే అధికారులపై వేటుపడుతోంది.

Tags