KA Paul : ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కూటమి 163 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. వైసిపి పై తిరుగులేని గెలుపును అందుకుంది. చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు, ఇతర వ్యవహారాల గురించి వైసిపి నాయకులు ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. పైగా ఒకటో రౌండ్ లెక్కింపు పూర్తి కాగానే చాలామంది వైసిపి నాయకులు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోయారు.. వైసీపీ నాయకులు చేయలేని సాహసాన్ని.. అడగలేని ప్రశ్నలను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్ చేశారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు నిలదీశారు. ఇంతకీ ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే..
పాల్ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 22 మంది దాకా ఉన్నారు. వారు పాల్ కు ఓటు వేసినప్పటికీ.. ఆయనకు కాకుండా ఆయన సమీప ప్రత్యర్థి, టిడిపి అభ్యర్థి శ్రీ భరత్ కు పడ్డాయట. ఈ విషయాన్ని పాల్ నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదట. చివరికి పాల్ గొడవ పెట్టుకుంటే.. ఆయన అక్నాలెడ్జ్మెంట్ కార్డు మీద సంతకం చేసారట. ఈ విషయాన్ని పాల్ విలేకరుల ఎదుట ప్రస్తావించారు. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలలో సిసి ఫుటేజ్ డాటా లో కొంత భాగం పాల్ కు ఇవ్వలేదట. అందువల్లే అతడు ఓటమి పాలయాడట. నిరుద్యోగులు, మహిళలు, పట్టభద్రులు పాల్ కు జై కొట్టారట. కానీ, రాత్రికి రాత్రి వేరే విధంగా ఆయన ఓట్లను ఇతరులకు మళ్లించుకున్నారట. ఇదే విషయాన్ని కోర్టు ఎదుట పాల్ స్పష్టం చేస్తారట.. ఇలాంటి ఎన్నికలు నిర్వహించ కంటే చైనా, రష్యా దేశాల అధినేతల లాగా నరేంద్ర మోడీ జీవితకాలం అధ్యక్షుడిగా ఉంటే సరిపోతుందట. అంతేకాదు తనకు ఓట్లు రాకుండా చేసిన వారందరిపై కేసులు పెడతాడట. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. అన్నట్టు పాల్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. విజయోత్సాహంలో ఉన్న కూటమి నాయకుడు కూడా పాల్ వీడియోను తెగ షేర్ చేస్తుండడం విశేషం