KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు( KA Pal) ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిల్ పై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. డబ్బులు కడితేనే ఆ పిల్ ను పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. సీసీటీవీ పూటేజీ భద్రపరచాలని ఆయన కోరగా.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని కోర్టు హెచ్చరించింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి రెండు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇది అనుమానాస్పద మృతి అని.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు కోరాయి. ఈ తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ వేశారు.
Also Read : ఆర్.కృష్ణయ్య నిజంగా బిచ్చగాడేనా.. కేఏ పాల్ మాటల్లో ఇంత మీనింగ్ ఉందా?
* హైకోర్టులో పిటిషన్..
పాస్టర్ ప్రవీణ్ పగడాల( Praveen pagadala ) మరణం పై సీబీఐ విచారణ జరిపించాలని కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ల బెంచ్ విచారణ చేస్తోంది. కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. సీసీటీవీ పుటేజీ మూడు నెలల్లో డిలీట్ అవుతుందని.. కాబట్టి దానిని భద్రపరచాలని పోలీసులకు ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? వాస్తవాలు తెలియకుండా వాదనలు చేయొద్దు అని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ పిల్ ను నిజాయితీగా వేశారని నిరూపించుకోవడానికి 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని కే ఏ పాల్ కు హై కోర్టు ఆదేశించింది.
* ఏపీ ప్రభుత్వానికి నోటీసులు..
ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై కోర్టులో కేసు నడుస్తోంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు( AP High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఈ మేరకు కోర్టు ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, సిట్ డి.ఎస్.పి తదితరులకు నోటీసులు జారీ చేసింది. కే ఏ పాల్ మాత్రమే కాదు.. రాజమండ్రి కి చెందిన దాడి నాగేశ్వరరావు కూడా హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ప్రవీణ్ పగడాల కేసును సిబిఐ కు అప్పగించాలని కోరారు. అయితే తాను వేసిన పిటిషన్ కు సంబంధించి కేఏ పాల్ సొంతంగానే వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని.. పోలీసులు కేసు దర్యాప్తును తప్పుదావ పట్టిస్తున్నారని పాల్ ఆరోపించారు. అయితే ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదమని ఏపీ పోలీసులు తేల్చేశారు. ప్రవీణ్ మద్యం మత్తులో బైక్ నడిపారని.. ప్రమాదవశాత్తు కింద పడి మరణించారన్నారు. అయితే క్రైస్తవ సంఘాలు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేఏ పాల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : నాగబాబుకు ఎమ్మెల్సీ.. కేఏ పాల్ ఆగ్రహం.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు