Justice Srinivas Reddy: ఇటీవల న్యాయవ్యవస్థ( judicial system) తీర్పులపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చే తీర్పులు, ధర్మాసనం వ్యాఖ్యలు ప్రజల్లో ఒక రకమైన చర్చకు దారితీస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో మితిమీరిన స్వేచ్ఛతో
.. న్యాయవ్యవస్థ సైతం ట్రోల్స్ కు గురవుతోంది. దీంతో సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు న్యాయమూర్తులు. సమాజంలో ఏర్పడిన భిన్న వర్గాలు, రాజకీయ వర్గాలు మూలంగా న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. చివరకు స్వతంత్రంగా వ్యవహరించే న్యాయవ్యవస్థకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కేసులో తీర్పు విషయమై సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన నిందితులకు బెయిల్ లభించింది. ఈ క్రమంలోనే జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తనపై జరుగుతున్న ట్రోల్స్ గురించి ప్రస్తావించారు. తన ముందు ఉన్న బెయిల్ కేసులను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.
Also Read: టిడిపి ఒంటరిగా సు’పరిపాలన’!
ఆ కేసుల విచారణ నిలిపివేతతో..
పల్నాడు జిల్లా( Palnadu district ) సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో సింగయ్య అనే వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు జగన్ తో పాటు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులను కొట్టివేయాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో జగన్ వేసిన పిటిషన్ పై హైకోర్టు అనుమతించింది. అయితే ఈ కేసు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ కేసు విచారణను కూడా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో అప్పటినుంచి సోషల్ మీడియాలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ట్రోల్స్ కు గురయ్యారు. ఇప్పుడు తిరుమల లడ్డూ నిందితులకు బెయిల్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంలోనే తనపై జరుగుతున్న ట్రోల్స్ గురించి ప్రస్తావించారు. ఈ తీర్పుతో మరోసారి తాను ట్రోల్స్ బాధితుడును అవుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించారు. తన బెంచ్ ముందున్న బెయిల్ కేసులను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.
అమరావతి కేసులో సైతం..
అయితే ఏపీలో వర్గాలు, రాజకీయాలు మూలంగా ఎప్పుడో న్యాయవ్యవస్థపై మరకలు పడ్డాయి. గతంలో అమరావతి రాజధాని( Amravati capital ) కేసుల్లో హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. ఆ సమయంలో పాలనా వ్యవస్థ పై న్యాయవ్యవస్థ పెత్తనం ఏంటని నాటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసిన సమయంలో కూడా అప్పటి వైసిపి ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వెళ్లాయి. కేవలం టిడిపి లీగల్ సెల్ విభాగంలో అప్పట్లో ఎన్వి రమణ పనిచేశారు. ఆపై చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే అప్పట్లో అభ్యంతర లేఖలు వెళ్లినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా అలానే జరిగింది. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. అటు తరువాత న్యాయమూర్తిగా హైకోర్టులో చేరారు. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి నేతల కేసుల విషయంలో సానుకూల తీర్పులు వస్తున్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి.
Also Read: పవన్ చేసిన పనికి గిరిజనులు ఫిదా!
విచారణ నుంచి తప్పుకుంటే మేలు
అయితే ఇటువంటి కేసుల విషయంలో న్యాయమూర్తులకు ఎటువంటి ఆదేశాలు రావు. తమకు తాముగా ఆ కేసుల విచారణ నుంచి తప్పుకుంటే చాలా మంచిది. లేకుంటే ఇటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తాయి. అయితే న్యాయవ్యవస్థపై సోషల్ మీడియా ట్రోల్స్ కాదు.. రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం ఇది కొత్త కాదు. అయితే న్యాయమూర్తి విధి అనేది సంక్లిష్టమైనది. విశాల దృక్పథాలు, ప్రయోజనాలను అనుసరించి తీర్పులు చెప్పాల్సిన పరిస్థితి న్యాయమూర్తులపై ఉంది. అది ఎంతో ఒత్తిడితో కూడిన విధి. అందుకే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడానికి కూడా ఇబ్బందులు పడుతోంది. అయితే ఇటువంటి పరిస్థితి మున్ముందు రాకుండా న్యాయవ్యవస్థకు మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.