Justice NV Ramana grief: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వి రమణ( justice NV Ramana ) ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి. న్యాయవ్యవస్థ గురించి ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సమయంలో, అమరావతి రాజధాని లో తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ సాగిన వ్యవహారాలపై పరోక్షంగా వ్యాఖ్యానించారు జస్టిస్ ఎన్వి రమణ. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి ఉంటే బాగుండేదని కొందరు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష ఆరోపణలు చేసి మరింత ఇబ్బంది పెడుతున్నారని ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. కానీ జస్టిస్ ఎన్వి రమణ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. సందర్భానుసారం మాత్రమే ఆ కామెంట్స్ చేసినట్లు సభకు హాజరైన ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఓ ప్రైవేట్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వి రమణ ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే జస్టిస్ ఎన్వి రమణ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు.. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులకు ఎదురైన పరిణామాలు గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆయన ఆవేదనతోనే మాట్లాడినట్లు విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
అప్పట్లో అదో సంచలనం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ( Supreme court chief justice)జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. 2020 అక్టోబర్లో ఆయన నియామకానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారట. ఏపీలో జస్టిస్ ఎన్వి రమణ ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న కొందరు న్యాయమూర్తులతో కలిసి తన తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, కోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారని జగన్ ఆరోపణలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదే రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన వ్యక్తిపై అటువంటి ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే నాడు న్యాయవ్యవస్థ స్వతంత్రత పై జరిగిన దాడిగా ఎక్కువమంది అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి లేక పై సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణ చేసింది. చివరకు జస్టిస్ రమణ కు క్లీన్ చీట్ లభించింది.
అమరావతి రైతుల నమ్మకాన్ని ప్రస్తావిస్తూ..
అయితే తాజాగా జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు అమరావతి( Amravati capital ) రైతుల పోరాటాన్ని, న్యాయవ్యవస్థపై వారు ఉంచిన నమ్మకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి చేసినవే. 2019 తర్వాత అమరావతి రాజధానిని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణ సమయంలో జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు.. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని ఆరోపణలను అప్పటి వైసిపి ప్రభుత్వం చేసింది. అంతటితో ఆగకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. జస్టిస్ రమణ పై ఒత్తిడి తీసుకురావడానికి.. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవడానికి.. ఆయన కుటుంబ సభ్యులకు అక్రమ కొనుగోళ్ల ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెట్టింది. కానీ సుప్రీంకోర్టు విచారణలో అటువంటివి జరగలేదని తేలింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. దాదాపు 16 నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు.
కేవలం చంద్రబాబుకు సన్నిహితుడని..
అయితే జస్టిస్ ఎన్వి రమణ సీఎం చంద్రబాబుకు( CM Chandrababu) సన్నిహితుడు అన్నది జగన్మోహన్ రెడ్డిలో ఉండిపోయిన అనుమానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో లీగల్ సెల్ కు సేవలందించారు. పైగా ఎన్టీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం.. వ్యవస్థలను మేనేజ్ చేస్తారని చేస్తారని చంద్రబాబుపై ఒక విమర్శ ఉండడం.. వంటి కారణాలతో ఎన్వి రమణ విషయంలో జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా అమరావతి రాజధానిలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారని ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ ఎన్వి రమణ ఎక్కడ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే నేరుగా ఆరోపణలు చేయలేదు కానీ.. రాజకీయ ప్రత్యర్థులతో పోరాడేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలను మాత్రం నేరుగా చేశారు జస్టిస్ ఎన్వి రమణ. కానీ దానికి పలువులు చిలువలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.