Delhi Airport Cyber Attack : దేశ రాజధానిలోని ఇండిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం రెండు గంటలపాటు విమానాలు స్తంభించిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా భారీ అంతరాయం కలిగిందని తెలిసింది. అధికారులు కూడా అదే చెప్పారు. కానీ, ఇప్పుడు సాంకేతిక లోపం కాదని స్పష్టమవుతోంది. భద్రతా సంస్థల ప్రాథమిక విచారణలో ఇది సైబర్ దాడి అని తెలుస్తోంది.
‘జీరో’ జీపీఎస్ సంకేతం..
విమానాల నావిగేషన్ వ్యవస్థపై జరిగిన ఈ దాడి ద్వారా గగనతల దిశాసూచీ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకున్నారు. సాధారణంగా హై ఆక్యురసీ జీపీఎస్ సిగ్నల్ స్థానంలో ‘‘జీరో టైప్’’ సంకేతం అందడంతో విమానాల దిశా నిర్దేశం పూర్తిగా తప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. తప్పుడు శాటిలైట్ సంకేతాలను పంపించడం ద్వారా జీపీఎస్ స్పూఫింగ్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ దాడి హమాస్ ఉగ్రవర్గం నుంచి జరిగినట్లు తెలిసింది. గాజా ప్రాంతం నుంచి సిగ్నల్ ట్రేస్ అయినట్లు కూడా సమాచారం. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ టెక్నికల్ సహకారం ఉన్నదన్న సంకేతాలు బయట పడుతున్నాయి. తాజాగా స్వాధీనం చేసుకున్న లాప్‌ట్యాప్‌లు, మొబైల్ పరికరాలు విశ్లేషణలో ఉన్నాయి.
నేతల విమానాలు టార్గెట్?
బిహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన నాయకులు ఢిల్లీ నుంచి తరచుగా రాకపోకలు సాగిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై అనుమానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రధాని మోదీ, హోంæ మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రయాణాలు ఉండటం నేపథ్యంలో రాజకీయ నేతల విమానాలను సాంకేతికంగా హైజాక్ చేయాలన్న ప్రయత్నం అయ్యి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా సైబర్ దాడులు బ్యాంకింగ్ లేదా సర్కార్ కమ్యూనికేషన్ సర్వర్లపైనే చేసేవారు. కానీ ఈసారి జీపీఎస్ ఆధారిత నావిగేషన్‌పై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. విమానాలు 30–33 వేల అడుగుల ఎత్తు నుంచి నడిచే ఈ సిస్టమ్ చెడిపోతే వాటి గమ్యం తప్పిపోవడమే కాకుండా పొరపాటున పొరుగు దేశాల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
పాకిస్తాన్ ఇటీవల సరిహద్దుల్లో సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించిన ఘటనలతోపాటు ఇప్పుడు ఈ సైబర్ దాడి ప్రయత్నం జరగడం భద్రతా విభాగాలను మరింత అప్రమత్తం చేసింది. ఏజెన్సీలు టెక్నికల్ ట్రాకింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్లను విశ్లేషిస్తూ సైబర్ యుద్ధం కొత్త దశకు తీసుకెళ్లే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నాయి.