Junior NTR And Lokesh: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో భావి నాయకుడిగా మారారు నారా లోకేష్. 2024 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి లోకేష్ ప్రభావం పెరుగుతోంది. అప్పటివరకు ఏదో ఒక మూలన అనుమానం ఉన్న టిడిపి శ్రేణులు సైతం ఇప్పుడు లోకేష్ తమ భావి నాయకుడిగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో లోకేష్ తన పరిణితి పెంచుకున్న తీరు మాత్రం అభినందనీయం. ఎన్నెన్నో అవమానాలను దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు సొంత పార్టీ శ్రేణులు సైతం అనుమానపు చూపులు చూసేవారు. ఎంతలా అంటే లోకేష్ ను పక్కనపెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ వరకు వచ్చారు. అయితే సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొని.. తనను తాను మెరుగుపరుచుకొని టిడిపి శ్రేణులు ముందు నిలబడ్డారు లోకేష్. అసలు సిసలైన రాజకీయాలు చేస్తూ.. ప్రత్యర్థులను వణికిస్తూ.. రాజకీయ పరిణితి పెంచుకుంటూ లోకేష్ ప్రజల ముందు ఆవిష్కృతం అయ్యారు.
* ఆ మార్క్ దాటేసిన చంద్రబాబు..
తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు( CM Chandrababu) ఉన్నారు. 1995 తెలుగుదేశం పార్టీ సంక్షోభ సమయంలో నందమూరి తారక రామారావు నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. నాటి నుంచి చంద్రబాబుపై ఒక రకమైన ముద్ర ఉంది. కానీ దానిని చెరిపేసుకొని తనకంటూ ఒక సొంత ముద్ర చాటుకున్నారు చంద్రబాబు. పాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఎన్నో అడ్డంకులను దాటుకొని నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరూ చెరపలేని.. చెరిపేయలేని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే చంద్రబాబు తర్వాత టిడిపిలో ఎవరు అనే సమాధానం ఎదురయింది. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ అంటే చాలామంది అంగీకరించలేదు. 2024 ఎన్నికల తర్వాత మాత్రం చంద్రబాబు తర్వాత ముమ్మాటికి లోకేష్ అని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ లోకేష్ హస్తగతంలోకి వెళ్ళింది.
* పుట్టినరోజు శుభాకాంక్షలు..
2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఇక ఆ పార్టీ పని అయిపోయిందన్న వారు ఉన్నారు. సొంత పార్టీ శ్రేణులు సైతం లోకేష్ ( Nara Lokesh )నాయకత్వం పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ను( Junior NTR) పార్టీలోకి తేవాలని డిమాండ్ చేసిన వారు ఉన్నారు. కానీ లోకేష్ తన ప్రతిభను పెంచుకున్నారు. తన పరిణితిని చాటుకున్నారు. పార్టీని అధికారంలోకి తేవడంలోనూ.. పార్టీని నిలబెట్టడంలోనూ.. అధికారంలోకి వచ్చాక తన మార్కు చూపించడంలోనూ సక్సెస్ అయ్యారు. ఎంతలా అంటే తనకు పోటీగా తేవాలని భావించిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒప్పుకునేలా. లోకేష్ జన్మదిన నాడు ప్రత్యేక ట్వీట్ చేశారు ఎన్టీఆర్. వచ్చే ఏడాదిలో కూడా లోకేష్ ఇదే పనితీరుతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షించారు. అంటే లోకేష్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వేరే అభిప్రాయం లేనట్టే. తద్వారా టిడిపి భావి నాయకుడు లోకేష్ అని తేలిపోయినట్టే. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీనిని ఆహ్వానిస్తున్నాయి కూడా.