NTR: సినిమా రంగానికి రాజకీయాలతో దగ్గర సంబంధం ఉంటుంది. సినీ రంగంలో సుపరిచితులైన వారు చాలామంది రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగు నాట నందమూరి తారకరామారావు, పవన్ కళ్యాణ్ ఈ కోవలోకి వస్తారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి సినిమా రంగం నుంచి ఎవరై ఉంటారా అనే చర్చ నడుస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పై ప్రచారం సాగుతోంది. తమిళనాడు లో విజయ్ మాదిరిగా.. ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారని టాక్ నడిచింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం దీనిపై స్పందించింది. అటువంటిదేమీ లేదని ప్రకటించాల్సి వచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో కలత చెందుతున్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లో ప్రచారం..
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి గతంలో పని చేశారు. 2009లో ఆ పార్టీ కష్టకాలంలో ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అక్కడ నుంచి ఏం జరిగిందో కానీ టిడిపి నాయకత్వంతో.. సొంత ఫ్యామిలీతో కొంత గ్యాప్ ఏర్పడినట్లు కనిపించింది. దీనిని మరింత పెంచి పోషించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. తరచూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. పదే పదే జూనియర్ ఎన్టీఆర్ను తోక్కేసారు అంటూ సంబోధించారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ది అని.. దానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మాట్లాడారు. వైసీపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ.. ఆ పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.
* వల్లభనేని వంశీ సైతం..
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు వల్లభనేని వంశీ మోహన్. ఆయన సైతం జూనియర్ ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే రాజకీయ ప్రకటనలు చేసేవారు. సహజంగానే టిడిపి నాయకత్వంతో జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ మరింత పెరిగేందుకు ఈ ఇద్దరు నేతలు కారణం అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తూ వారిద్దరూ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు అనే అంత రేంజ్ లో ప్రచారం చేశారు. సహజంగానే అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ పై గౌరవభావంతో ఉన్న టిడిపి కార్యకర్తలు.. ఈ చర్యలతో ఆయనపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని వదులుకున్నారు.
* ఆ ఇద్దరినీ పిలిచి..
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటించారు. కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సంకేతాలు పంపించారు. అయితే ఇప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ పై జరుగుతున్న ప్రచారం.. సొంత పార్టీ ఏర్పాటుపై అత్యంత సన్నిహితులతో జరుపుతున్న చర్చలు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. కానీ తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ నాయకత్వంతో పూడ్చుకోలేని గ్యాప్ పెరగడానికి మాత్రం ఆ ఇద్దరు కారణం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం. అందుకే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇకనుంచి మీ రాజకీయాల కోసం నా పేరు వాడవద్దు అంటూ గట్టి హెచ్చరికలు పంపినట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.