Vidudala Rajini : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే?అక్కడ అవసరాలు పనిచేస్తాయి తప్ప మరొకటి కాదు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఏ పార్టీలో ఉంటారు చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. అధినేతకు ఎంతో నమ్మకస్తురాలిగా ఉంటూ.. ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న ఆమె.. మారిన పరిస్థితులతో తాను ట్రబుల్ అవుతున్నారు. దానిని అధిగమించేందుకు జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది. గతంలో జనసేనలో చేరబోయే వైసీపీ నేతను బుజ్జగించారు. అయినా సరే సదరు నేత జనసేనలోకి వెళ్లిపోయారు.కానీ అదే నేత ఇప్పుడు ఆమెను సైతం జనసేనలోకి తీసుకెళ్లేందుకు పావులు కదుపుతుండడం విశేషం. కొద్ది రోజుల కిందట వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఓటమి తర్వాత తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని పార్టీని వీడుతానని పలుమార్లు సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో జగన్ అన్ని విధాలా ఆయనను బుజ్జగించారు. కానీ బాలినేని మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చివరకు వైసీపీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి విడదల రజినీని ప్రయోగించారు జగన్. ఆమె నేరుగా వెళ్లి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో చర్చలు జరిపారు.కానీ బాలినేని మాత్రం మనసు మార్చుకోలేదు. నేరుగా పవన్ సమక్షంలోనే జనసేనలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విడదల రజిని వైసీపీలో సైలెంట్ అయ్యారు. ఆమెను జనసేనలో చేర్చేందుకు మాజీ మంత్రి బాలినేని పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
* తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యే
2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గెలిచారు రజిని. అప్పటివరకు టిడిపిలో కొనసాగిన రజిని ప్రత్తిపాటి పుల్లారావు కు ప్రధాన అనుచరురాలుగా ఉండేవారు. సైబరాబాద్ నిర్మించిన మొక్క అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు రజిని. అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్ నుంచి పిలుపు వచ్చేసరికి రజిని వైసీపీలోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు పై పోటీ చేసి గెలిచారు. మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా రజినీని క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్.కానీ ఆమె చిలకలూరిపేట నియోజకవర్గంలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కానీ ఆమెను అనూహ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకెళ్లారు. అక్కడ టిక్కెట్ ఇచ్చినా ఆమె గెలవలేకపోయారు. వైసిపి ఓడిపోయిన తరువాత కూడా రజిని యాక్టివ్ గానే పనిచేశారు. కానీ ఇటీవల అధినేత తీరు నచ్చక అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
* మహిళా నేతలకు తగ్గిన ప్రాధాన్యం
వైసీపీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించిన సంగతి తెలిసిందే. ఆమె వచ్చిన తర్వాత వైసిపి మహిళా నేతలకు ప్రాధాన్యం తగ్గించినట్లు సమాచారం. అదే విషయాన్ని వాసిరెడ్డి పద్మ కూడా ప్రస్తావించారు. ఎన్ని రోజులపాటు సేవలందించిన తాము యాంకర్ శ్యామలకు తగమా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు యాంకర్ శ్యామల వచ్చిన తర్వాత విడదల రజిని పాత్ర కూడా తగ్గినట్లు తెలుస్తోంది. వైసిపి విధానపరమైన నిర్ణయాలు మాట్లాడినప్పుడు హై కమాండ్ రజినీని ఆశ్రయించేది. కానీ ఇప్పుడు యాంకర్ శ్యామలను తెరపైకి తేవడంతో రజిని రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాలినేని పావులు కదపడంతో రజిని జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.