https://oktelugu.com/

JC Prabhakar Reddy: కూటమిలో చిచ్చు.. జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి

మూడు పార్టీలు మరో దశాబ్ద కాలం పాటు పొత్తుతో కొనసాగాలని నిర్ణయించాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రేగిన వివాదం కూటమి ఐక్యతకు విఘాతంగా మారుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2025 / 03:08 PM IST

    JC Prabhakar Reddy

    Follow us on

    JC Prabhakar Reddy:  ఏపీలో కూటమి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా రాయలసీమలో జరుగుతున్న వరుస పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురంలో జెసి కుటుంబానికి చెందిన బస్సుల దగ్ధం వెనుక బిజెపి నేతలు ఉన్నారని ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో ప్రభాకర్ రెడ్డి బిజెపి మహిళా నేతలపై చేసిన ఆరోపణలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై కాషాయ దళం నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ ప్రారంభమైంది. టిడిపి హై కమాండ్ స్పందించి ప్రభాకర్ రెడ్డిని అదుపులో పెట్టుకోవాలని అనంతపురం బిజెపి జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. బిజెపి కంటే జగన్ నయం అని.. జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తన బస్సులను జగన్ ఉంచాడని.. కానీ బిజెపి నేతలు కాల్చేశారని.. అప్పట్లో జగన్ 10 లక్షలు నష్టానికి గురి చేస్తే.. ఇప్పుడు బిజెపి నేతలు ఆరు లక్షల రూపాయల నష్టం చేకూర్చారని సంచలన ఆరోపణలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి.

    * మహిళా నేతల పై కామెంట్స్
    అంతకుముందు తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలపై బిజెపి మహిళా నేతలు యామినీ శర్మ, మాధవి లతలు తీవ్ర విమర్శలు చేశారు. వారి కామెంట్స్ పై జెసి ప్రభాకర్ రెడ్డి సైతం ఘాటుగా స్పందించారు. వారిని హిజ్రాలతో పోల్చినట్లు బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనంతపురం బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన మహిళ నేతలను హిజ్రాలతో పోల్చడం దుర్మార్గమన్నారు. జెసి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడనేందుకు ఆయన అనుచిత కామెంట్స్ నిదర్శనం అన్నారు. ప్రభాకర్ రెడ్డి వైఖరి టిడిపికి రాజకీయంగా నష్టం తీసుకొస్తుందని హెచ్చరించారు. ఆయన తీరు మార్చుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

    * ప్రభాకర్ రెడ్డి తీరుతో టిడిపికి ఇబ్బంది
    ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి టిడిపికి ఇబ్బంది తెచ్చిపెడుతోంది. సిమెంటు కంపెనీలకు బూడిద తరలింపు విషయంలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొద్దిరోజుల పాటు ప్రభాకర్ రెడ్డికి వివాదం నడిచింది. తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అయితే ఆ వివాదం సమసిపోగా… బిజెపి మహిళా నేతలపై ప్రభాకర్ రెడ్డి నోరుపారేసుకోవడం.. జెసి ఫ్యామిలీ ట్రావెల్ బస్సులు కాలిపోవడం.. అందుకు బిజెపి నేతలే కారణమని ప్రభాకర్ రెడ్డి ఆరోపించడం సంచలనం గా మారుతోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న చర్చ నడుస్తోంది.