Karnataka: ఎన్నికల హామీలు అమలుపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రాధాన్యత క్రమంలో ఒక్కో పథకం అమలు చేయాలని భావిస్తోంది. నిన్ననే మంత్రివర్గ సమావేశంలో చాలా పథకాలపై చర్చించింది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేయాలని భావిస్తోంది. తొలుత సంక్రాంతి నుంచి ఈ పథకం అంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఉగాది అంటూ కొత్త టాక్ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఏపీకి చెందిన మంత్రులు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో కనిపించడం విశేషం. ప్రస్తుతం అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రవాణా శాఖ మంత్రి మండి పిల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో కనిపించారు. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* ఎన్నికల్లో ప్రధాన హామీ
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీ అమలుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలవుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఇద్దరు మహిళా మంత్రులు.. ఆ మూడు రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా కర్ణాటక వెళ్లి అక్కడ ప్రజా రవాణా బస్సుల్లో ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం బెంగళూరులో అక్కడి రవాణా శాఖ అధికారులతో మంత్రుల బృందం భేటీ అయింది. పథకం అమలును తెలుసుకునే ప్రయత్నం చేసింది. మంత్రులతో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కూడా ఉన్నారు.
* ప్రారంభం ఎప్పుడో?
అయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఇంకా ఫుల్ క్లారిటీ రావడం లేదు. ఉగాది నుంచి పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రచారం నడిచింది. అయితే టిడిపికి చెందిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాత్రం సంక్రాంతి నుంచి పథకం అమలవుతుందని ప్రకటించారు. మరోవైపు నేరుగా మంత్రులు అధ్యయనం చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ ఇస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి నుంచి పథకాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. మరి నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.