JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయంగా దూకుడుగా ఉంటారు ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఈ నాయకుల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా ప్రభాకర్ రెడ్డి ఏకంగా పోలీస్ అధికారిపై విమర్శలకు దిగారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నాడే తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరుపై మండిపడ్డారు. ఆయన ఒక్కసారైనా పోలీస్ డ్రెస్ లో కనిపించలేదంటూ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* మొన్నటి ఘటనతో..
మొన్న ఆ మధ్యన జెసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy) కొన్ని అంశాలకు సంబంధించి వినతులు అందించేందుకు ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో కార్యాలయంలోనే ఏఎస్పి ఉన్నారు. కానీ ఆయన స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ప్రభాకర్ రెడ్డి. ఏకంగా ఏఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. టెంట్ కట్టి ఆందోళన చేసినంత పని చేశారు. ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఈఎస్పీకి చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం, తెలివి లేవన్నారు. ఏ ఎస్ పి ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని స్పష్టం చేశారు. తాను కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేస్తుంటే రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఘర్షణలు జరుగుతుంటే ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు.
* త్వరలో ఉత్తరప్రదేశ్ కు..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు రోహిత్ కుమార్ చౌదరి( Rohit Kumar Chaudhari ). ఉత్తరప్రదేశ్ వాళ్లకి బుద్ధి జ్ఞానం లేదని జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. త్వరలో 10,000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని మళ్లీ ఉత్తరప్రదేశ్ కి పంపిస్తామని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్ల వైసిపి పాలనలో ఐపీఎస్, ఐఏఎస్ ల తీరు వల్ల పోలీస్ శాఖ భ్రష్టు పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభాకర్ రెడ్డి. ఆయన వచ్చాక తాడిపత్రిలో క్రైమ్ రేట్ తగ్గలేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికైతే జెసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన జేసీ
నీ అంత పనికిమాలినోడు ఎవడు లేడు, చదువు ఉంది కానీ బుద్ది లేదంటూ తాడిపత్రి ASP పై రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి pic.twitter.com/BBtWbwkcOc
— greatandhra (@greatandhranews) October 21, 2025