Divorce: దాంపత్య జీవితం ఎంతో అందమైనది. ఇద్దరు తెలియని వ్యక్తులు ఒకే ప్రయాణంలో చేస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. అలాగే ఎన్నో అనుభూతులు పొందుతారు. ప్రస్తుత కాలంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడానికి విమర్శలు, కోపాలు వంటివి ప్రదర్శిస్తారు. అయితే ఇవి కొందరి జీవితంలో తాత్కాలికంగా మాయమవుతాయి. కానీ మరీ కొందరి జీవితంలో అలాగే ఉండి విడాకులకు దారితీస్తాయి. ముఖ్యంగా విడాకులకు దారి తీయడానికి నాలుగు అంశాలు ప్రధానంగా నిలుస్తాయని కొందరు న్యాయవాద నిపుణులు తెలుపుతున్నారు. ఈ నాలుగు విషయాల్లో ఒకరి కంటే మరొకరు ఎక్కువగా వాదన చేసి బంధాన్ని దూరం చేసుకుంటారని అంటున్నారు. మరి ఆ నాలుగు విషయాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
దిక్కారం:
భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయినప్పుడు.. ఒకరిపై ఒకరికి అప నమ్మకం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ఒకరి కంటే ఒకరు తమకంటే తక్కువ అని భావిస్తారు. ఇలా భావించినప్పుడు ఎగతాళి చేయడం.. అపహస్యం చేయడం.. అవమానించే పదజాలం వాడడం వంటివి చేస్తారు. ఇలాంటి పదాలు వాడినప్పుడు ఎదుటివారి ఆత్మగౌరవం కోల్పోతారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం ఏర్పడి బంధం దూరం కావడానికి కారణం అవుతుంది
విమర్శ:
ఎదుటివారు మనకు నచ్చని పని చేసినప్పుడు వారిపై విమర్శలు చేస్తుంటాం. కానీ వివాహ బంధంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. భార్య లేదా భర్త ఒక పని చెప్పినప్పుడు మరొకరు చేయలేక పోతే ఎందుకు చేయలేదు? అనేది కామన్ గా అడిగే విషయం. కానీ కొందరు దీనిని విమర్శనాత్మకంగా చెబుతారు. అంటే నువ్వు ఎప్పుడూ చెప్పిన ఎలాంటి పని చేయవు.. నీకు పని చేయడం చేతకాదు.. అంటూ వాదిస్తారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారిని అవమానించినట్లు అవుతుంది. దీంతో వారి మనసులో బాధ కలిగించి భాగస్వామితో కలిసి ఉండే అవసరం లేదని భావన కలుగుతుంది.
సమర్ధించుకోవడం:
భార్యాభర్తల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఒకరు చేసిన తప్పును మరొకరు మన్నించగలిగితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఒకరు తప్పు చేసినా.. తమది రైట్ అన్నట్లు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎదుటివారిపై వాదన చేస్తూ ఉంటారు. ఈ వాదన పెద్దదిగా అయి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమవుతుంది. ఫలితంగా భాగస్వాముల మధ్య దూరం పెరిగి విడిపోవడానికి కారణం అవుతుంది.
చెప్పింది వినకపోవడం:
భార్యాభర్తల మధ్య చిన్న గొడవ పెద్దదిగా మారడానికి ఒకరి మాట ఒకరు వినకపోవడమే. ఒక్కోసారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అయితే మానసికంగా కుంగిపోయిన వారు ఎదుటివారు చెప్పింది వినకుండా తమ పని చేసుకుంటూ వెళ్తారు. ఇలా ఉండడం మరొకరికి నచ్చదు. దీంతో ఇతర మధ్య వివాదం ఏర్పడి ఆ తర్వాత పెద్దదిగా మారుతుంది.
అయితే భార్యాభర్తల మధ్య ప్రతి విషయంలో గొడవ ఏర్పడడం సహజం. ఒకరికి కోపం ఉన్నప్పుడు మరొకరు తగ్గడం.. ఒకరు బాధలో ఉన్నప్పుడు మరొకరు ఓదార్చడం.. వంటివి చేయడం వల్ల ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బలమైనది అయితే వారు ఎప్పటికీ విడిపోరు.