Janasena Rajya Sabha Candidate: ఈ ఏడాది జనసేనకు ( janasena) మరింత ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవులు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవులు పెద్ద ఎత్తున ఖాళీలు కానున్నాయి. అవి కూటమి పార్టీలకే దక్కనున్నాయి. తప్పకుండా జనసేనకు ఈ పదవుల్లో భాగస్వామ్యం దక్కనుంది. రాజ్యసభలో జనసేనకు ఇప్పటివరకు ఛాన్స్ దక్కలేదు. ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం వచ్చింది. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే ఆ కోట కింద ఎమ్మెల్సీలు సైతం కూటమికి దక్కనున్నాయి. అందులో కూడా జనసేన ప్రాతినిధ్యం కోరుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది జనసేనకు పదవుల కాలం.
* నలుగురి పదవీ విరమణ..
రాజ్యసభలో నలుగురు సభ్యులు జూన్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ ఖాళీలకు సంబంధించి ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. టిడిపి సభ్యుడు సానా సతీష్ సైతం ఖాళీ కానున్నారు. అయితే ఆయన పదవి ఆయనకే దక్కే అవకాశం ఉంది. మిగతా మూడు స్థానాలు సైతం కూటమి పార్టీలు సర్దుబాటు చేసుకోనున్నాయి. తప్పకుండా ఒక పదవి జనసేనకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గత రెండుసార్లు జనసేన రాజ్యసభ పదవులను కోరుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా పార్టీకి ఛాన్స్ ఇస్తారు. ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో సైతం జనసేనకు ప్రయారిటీ ఉంటుంది. ఇప్పటికే దీనిపై సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* నాగబాబు ఆశించినా..
వాస్తవానికి జనసేనలో మెగా బ్రదర్ నాగబాబుకు ( Nagababu )రాజ్యసభ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. గడిచిన ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అది వర్క్ అవుట్ కాకపోయేసరికి రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టాలన్నది తన అభిప్రాయంగా అనుచరుల వద్ద చెప్పుకున్నారు. అయితే సమీకరణల దృష్ట్యా నాగబాబుకు రాజ్యసభ పదవి ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు. అందులో భాగంగా గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా మాత్రం ఇంతవరకు అవకాశం రాలేదు. జనసేనలో రాజ్యసభ పదవి కోసం ఎదురుచూసిన ఒక్కగానొక్క నేత అలా తప్పుకున్నట్లు అయింది. ఇప్పుడు జనసేనకు ఆ పదవి ఇస్తే ఎవరికీ దక్కుతుంది అనే చర్చ బలంగా నడుస్తోంది.
* లింగమనేని రమేష్ పేరు..
ఒకవేళ జనసేనకు రాజ్యసభ పదవి ఇస్తే పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. ఆపై చంద్రబాబుకు సైతం దగ్గర వ్యక్తి. గత కొంతకాలంగా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. జనసేనలో రాజ్యసభ పదవి కోసం ఎటువంటి పోటీ లేకపోవడంతో ఆయన పేరును ఖరారు చేస్తారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.