Janasena Internal Dispute: జనసేనలో( janasena ) ఒక స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ పార్టీలో జనసేన సిద్ధాంతాలు నమ్మిన వారికి, మెగా అభిమానులకు మధ్య ఈ విభజన రేఖ ఉంది. జనసేన సిద్ధాంతాలను అభిమానించే వారి కంటే.. మెగా అభిమానులకి ప్రాధాన్యం ఇస్తున్నారన్న కామెంట్ ఉంది. దానికి ప్రధాన కారణం నాగబాబు అనే టాక్ ఉంది. నేరుగా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అటువంటి పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. నాగబాబు మెగా అభిమానులకు ప్రాధాన్యం ఇచ్చి.. జనసేన కోసం నమ్మిన వారిని అన్యాయం చేస్తున్నారు అనే విమర్శ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఈ విషయంలో సరైన సలహాలు ఇవ్వడం లేదన్న ఆరోపణ ఉంది. అయితే నాగబాబు ఏదో ఆశించి పనిచేయడం లేదు. అలాగని తప్పుడు ఉద్దేశం ఆయనకు లేదు. కానీ ఎందుకో ఆయన మెగా చట్రం మధ్య ఉండి పోయారు. వారే జనసేనకు బలం అని నమ్ముతున్నారు.
Also Read: అమరావతి రైతుల బాధను గుర్తించిన విజయసాయిరెడ్డి
* గుణపాఠాలు నేర్చుకోని మెగా బ్రదర్
వాస్తవానికి ప్రజారాజ్యం ( Praja Rajyam )పార్టీ విఫలం కావడంతో మెగా అభిమానులు రాజకీయాలు వదిలేసారు. పవన్ కళ్యాణ్ జనసేన ప్రత్యేక సిద్ధాంతంతో ఏర్పడినదే. అంతేతప్ప సినీ చరిష్మతో ఏర్పడినది కాదు. పవన్ కళ్యాణ్ సైతం జనసేన ను సినిమా కోణంలో చూడొద్దు అంటారు. కేవలం జనసేన సిద్ధాంతాలు నచ్చిన వారే పనిచేయాలని సూచిస్తుంటారు. సినీ అభిమానం వర్కౌట్ కాదని కూడా ఆయనకు తెలుసు. కానీ ఈ విషయంలో నాగబాబు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎంతవరకు ఇక్కడ సినీ రంగంలో మాదిరిగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సినీ పరిశ్రమలో సైతం నాగబాబు దూకుడు తనం ఎక్కువ. ఆయన ఎంతవరకు చిరంజీవి, మెగా ఫ్యాన్స్ అన్న కోణంలోనే ఆలోచన చేస్తారు. ఇప్పటి రాజకీయాలకు అనుగుణంగా నాగబాబు అప్డేట్ కాలేకపోయారనే విమర్శ ఉంది.
* పార్టీలో కీ రోల్
జనసేనలో మెగా బ్రదర్ నాగబాబుది( Mega brother Naga babu ) కీలక పాత్ర. ఆ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచిన వ్యక్తి కూడా ఆయనే. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరును నాగబాబు గుర్తించడం లేదు. ఎంతవరకు తన సోదరుడు చిరంజీవి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్.. ఈ ఆలోచనతోనే ఆయన కొనసాగుతున్నారు. అందుకే ఇప్పుడు పార్టీలో విభజన రేఖకు ఆయనే కారణం అనే విమర్శకు గురవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం మెగా ఫ్యాన్స్ కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారని.. ఆది నుంచి పార్టీ జండా మోసిన వారికి అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందో లేదో చూడాలి. అసలు ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.