Janasena : జనసేన నుంచి కీలక ప్రకటన రానుందా? వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై ఫోకస్ పెట్టారా? కీలక నియోజకవర్గాలను ఇన్ చార్జిలను ఖరారు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ వారాహి విజయోత్సవ యాత్రలో ఉన్నారు. జగన్ సర్కారు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. యాత్ర మధ్యలో నియోజకవర్గాల రివ్యూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గతంగా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయవాడ నగరాల్లో కీలక నియోజకవర్గాలు జనసేనకు అనుకూలంగా ఉన్నాయి. అక్కడ పొత్తులు ఉన్నా.. లేకపోయినా జనసేనకు ఫేవర్ గా ఉంటాయని వివిధ సర్వేల్లో సైతం తేలింది. అటువంటి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు పవన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. చాలా మంది నాయకులు వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరే అవకాశముంది. కానీ అటువంటి వారి కంటే ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులకు ఎక్కువగా అవకాశమివ్వాలని పవన్ భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎపిసోడ్ ను గుణపాఠంగా తీసుకుంటున్నారు. జనసేన గుర్తుపై గెలిచి.. కనీస అవగాహన లేకుండా రాపాక వ్యవహరించిన తీరు అందరికీ సుపరిచితమే. అటువంటి పరిస్థితి మరోసారి రాకుండా చూడాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఇన్ చార్జిలను నియమించాలా? లేకుంటే రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో బాధ్యులను భర్తీ చేయాలా? అన్న డైలమాలో ఉన్నారు. అయితే పార్టీలో ఉన్న విపరీతమైన పోటీ నేపథ్యంలో ఇన్ చార్జిల ప్రకటన చేస్తే నేతలు అలకబూనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభ్యర్థులు, ఇన్ చార్జిల ప్రకటనలో వైసీపీ, టీడీపీలు దూకుడు మీద ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. పార్టీ అంతర్గత సమావేశాలతో ఇరువురు అధినేతలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ సైతం అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు ప్రారంభించడంతో పొలిటికల్ హీట్ నెలకొనే అవకాశముంది. వారాహి రెండో విడత యాత్ర ముగియడంతో కీలక నియోజకవర్గాలకు ఇన్ చార్జుల పేర్లు ఖరారు చేసే అవకాశముందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.