Balineni Srinivasa Reddy: వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గురువారం ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. గత కొంతకాలంగా వైసీపీ పై అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు చేరేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఒంటరిగా వచ్చి పార్టీలో కలవాలని.. ఎటువంటి బల ప్రదర్శన చేయవద్దని బాలినేనికి జనసేన హై కమాండ్ సూచించడం చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం జనసేనలో చేరడం బాలినేనికి అవసరం. బాలినేని అవసరం జనసేనకు లేదు. అయితే జనసేనలో చేరిన తర్వాత బాలినేని ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. వైసీపీలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని అడిగారు. పార్టీ టికెట్ల కేటాయింపు సైతం తన కనుసన్నల్లో జరగాలని ఆకాంక్షించారు. కానీ అందుకు జగన్ ఒప్పుకోలేదు. ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. ఇది బాలినేనికి రుచించలేదు. అందుకే ఆయన పార్టీ మారిపోయారు.
* నిత్య అసంతృప్తి వాది
బాలినేని వైసీపీలో నిత్య అసంతృప్తి వాదిగా మిగిలారు. ఆయనను వదులుకునేందుకు జగన్ కు ఇష్టం లేదు. పార్టీని విడిచి పెట్టేందుకు బాలినేని కూడా మనసు అంగీకరించలేదు. కేవలం పరిస్థితులను బట్టి ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన మనుగడ కోసమే జనసేనలో చేరుతున్నారు. అయితే జనసేన కూటమి ప్రభుత్వంలో ఉంది. పైగా పవన్ ఇలాంటి వాటికి లెక్క చేయరు. అయితే బాలినేనికి వేరే ఆప్షన్ లేకపోవడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే జనసేనలో చేరుతున్నారు. అయితే ఆదిలోనే బాలినేనికి చెప్పాలని జనసేన భావిస్తోంది. అందుకే పార్టీ చేరే కార్యక్రమాన్ని హడావిడి చేయవద్దని ఆదేశించింది.
* మంత్రిగా తొలగించడంతో
జగన్ మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తప్పించారు. అప్పటినుంచి ఆయనలో అసంతృప్తి పెరిగింది. ఎప్పటికప్పుడు నిరసన గళం వినిపిస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను ఇవ్వడంతో పాటు.. తాను నచ్చిన మేరకు చేర్పులు, మార్పులు చేయాలని తరచు కోరుతుండేవారు. కానీ అందుకు జగన్ అంగీకరించలేదు. అయితే అదే పరిస్థితి జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా ఉంటుందని ఆ పార్టీ హై కమాండ్ గుర్తించింది. అందుకే కొన్ని రకాల షరతులు విధించినట్లు తెలుస్తోంది. వైసిపి మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తామంటే కుదరదు. అన్ని షరతులకు తలొగ్గి బాలినేని జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* టిడిపి ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు బాలినేని. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్ధన ఎమ్మెల్యేగా గెలిచారు. బాలినేని పార్టీ కార్యక్రమం లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జనసేనలోకి వచ్చినంత మాత్రాన పాపాలు పోవని.. దానిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు. అటు జనసేన షరతులు విధించడం, ఇటు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరికతో బాలినేని ఓకింత అసహనానికి గురవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వైసిపి లో అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన ఆ పార్టీలో కూడా కొనసాగే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు బాలినేని డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో నిరాడంబరంగానే జనసేనలో చేరనున్నట్లు సమాచారం.