Janasena Party : పవన్ తాజా కామెంట్స్ వెనుక వ్యూహం ఉందా? పదేళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉంటారనడం దేనికి సంకేతం?నిజంగా అదేమాటపై నిలబడతారా? లేకుంటే మాట మార్చుతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరో పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు కొనసాగుతారని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటి నుంచి రకరకాల విశ్లేషణ ప్రారంభం అయింది.అయితే పవన్ ఇంత సులువుగా ప్రకటించడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రధానంగా జనసైనికులు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే విశ్లేషకులు మాత్రం వేరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కామెంట్స్ వెనుక పక్కా వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. మరో పదేళ్లపాటు సీఎంగా చంద్రబాబు ఉంటే.. అప్పటికి ఆయన వయస్సు 85 సంవత్సరాలు. అంటే వయోభారంతో బాధపడతారు. అప్పటివరకు కొనసాగే అవకాశం కూడా డౌటే. కానీ పవన్ మాత్రం మరో పదేళ్లపాటు ఆయనే ఉంటారని చెబుతుండడం వెనుక కారణం ఏంటి అన్నది హాట్ టాపిక్ అవుతోంది. తప్పకుండా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే యోగ్యతను తన వద్దకు తెచ్చుకునేందుకు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.
* కష్టాలను అధిగమించి
జనసేన ఆవిర్భావం నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల నాటికి జనసేన ఆవిర్భవించింది. కానీ అప్పట్లో పోటీ చేయలేదు పవన్. రాష్ట్రంలో చంద్రబాబుకు, జాతీయస్థాయిలో ఎన్డీఏకు మద్దతు పలికారు పవన్. రెండు చోట్ల తాను మద్దతు తెలిపిన వారే అధికారంలోకి వచ్చారు. అయినా సరే పవన్ అడ్వాంటేజ్ తీసుకోలేదు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు పవన్. అప్పటినుంచి చాలా రకాల అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వైసీపీ శ్రేణుల చేతిలో అవమానాలకు గురయ్యారు. అయినా సరే అకుంఠిత దీక్షతో జనసేన ను మరింత విస్తరించగలిగారు. టిడిపి తో పాటు బిజెపిని ఒప్పించి పొత్తులు కుదుర్చుకున్నారు. పొత్తు సక్సెస్ అయ్యింది కూడా. ఈ పరిణామక్రమాలను గమనిస్తే.. పవన్ చతురత అర్థం అవుతుంది. ఆయన ప్రతిష్ట వెనుక వ్యూహం ఉన్నట్లు తేలుతుంది. ఇప్పుడు సీఎంగా మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ఉంటారని చెప్పడం వెనుక కూడా ఏదో ఒక వ్యూహం ఉంటుందన్న అనుమానం విశ్లేషకుల్లో ఉంది.
* పవన్ టార్గెట్ వైసిపి
రాష్ట్రంలో వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని పవన్ భావిస్తున్నారు. అదే తన లక్ష్యంగా మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ డీలా పడుతుందని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. అందుకే వైసీపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ ను చూడాలని జనసైనికులు భావిస్తున్నారు. అయితే అదే విషయంపై రెచ్చగొట్టే ధోరణితో ఉంది వైసీపీ. టిడిపి జనసేనల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే జనసేన శ్రేణులను నియంత్రించేందుకు పవన్ శాసనసభలో.. మరో పదేళ్లపాటు సీఎంగా చంద్రబాబు ఉంటారని ప్రకటించి ఉంటారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మొత్తానికైతే పవన్ అంతరంగం ఎవరికీ అంతుపట్టడం లేదు. నెక్స్ట్ సీఎం గా పవన్ ను చూసుకుంటే.. ఆయన అలా మాట్లాడుతుండడం పై జనసైనికుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.