YS Jagan Mohan Reddy : ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. 175 స్థానాలకు గాను 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రజలు దారుణంగా తిరస్కరించారు. దీంతో వైసిపి పని అయిపోయిందని అంతా భావించారు. ఇక ప్రజలు వైసీపీని గుర్తించరని అంచనా వేశారు. అదే సమయంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ చర్యలతో వారంతా పునరాలోచనలో పడ్డారు.నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు.కొద్ది రోజులు ఆగి చూసి అడుగులు వేయాలని భావిస్తున్నారు.
* ప్రారంభంలో ఇబ్బందిగానే
ఓటమి ఎదురైన వెంటనే జగన్ నైరాస్యంలో కూరుకుపోయారు. తొలిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడే సమయంలో చాలా బాధతో కనిపించారు. ప్రజలకు ఎంతో చేసినా వారు తిరస్కరించారని జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో సైతం డీలాగా కనిపించారు. శాసనసభ సమావేశాలకు సైతం ముఖం చాటేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఇక జగన్ ప్రజల్లోకి వస్తారా? ప్రజలు ఆదరిస్తారా? అన్న అనుమానం ప్రారంభమైంది.
* బాధితుల పరామర్శల పేరుతో
ఓటమి తర్వాత చాలామంది వైసిపి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసిపి హయాంలో పదవులు అనుభవించిన వారు సైతం సైలెంట్ అయ్యారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన వారు పక్కచూపులు చూస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ స్ట్రాటజీ మార్చారు. వివిధ కేసుల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడకు వెళ్తున్నా జనాలు తగ్గడం లేదు. వేచి చూడడం కనిపిస్తోంది. విజయవాడలో, నిన్న కాకినాడలో వరద బాధితుల పరామర్శ సమయంలోఅక్కడి ప్రజలు జగన్ ను ఆత్మీయంగా స్వాగతం పలికారు. అక్కున చేర్చుకున్నారు.
* ఎక్కడికి వెళ్ళినా జనం
ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి జగన్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆత్మస్థైర్యం కనిపిస్తోంది.పార్టీకి పూర్వ వైభవం ఖాయమని ఎక్కువమంది నమ్ముతున్నారు. అటు జనాలను చూసి పార్టీని వీడుతామనుకున్న నేతలు ఆలోచనలో పడ్డారు. ఇదే దూకుడు కొనసాగించాలని జగన్ సైతం డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ప్రజా వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. మొత్తానికైతే జగన్ స్ట్రాటజీ మార్చారు.