Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి జగన్ ఝలక్

గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొందారు. జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకి జగన్ పంచన చేరారు.

Written By: Dharma, Updated On : February 23, 2024 1:08 pm

Vallabhaneni Vamsi

Follow us on

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి టిక్కెట్ లేదని జగన్ తేల్చేశారా? గన్నవరం నుంచి మీరు గెలవలేరని చెప్పేశారా? ఇంకో నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించారా? దానికి వల్లభనేని వంశీ సమ్మతించలేదా? అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంతకాలంగా వల్లభనేని ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. వల్లభనేని వంశీకి జగన్ దాదాపు మొండి చేయి చూపారని ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొందారు. జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకి జగన్ పంచన చేరారు. టిడిపి నుంచి ఫిరాయించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబును టార్గెట్ చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు జగన్ సైతం ప్రోత్సహించడం, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖరారు చేయడంతో వల్లభనేని రెచ్చిపోయారు. దీంతో అప్పటివరకు వైసీపీ ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి జంప్ అయ్యారు. మరో నేత దుట్ట రామచంద్రరావు మాత్రం వల్లభనేని వంశీని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గన్నవరంలో సామాజిక వర్గ ప్రభావం అధికం. వల్లభనేని వంశీ స్థాయికి మించి చంద్రబాబుపై విమర్శలు చేయడంతో ఆ సామాజిక వర్గానికి దూరమయ్యారు. ఒకవైపు వైసీపీలో సొంత నేతలు వ్యతిరేకించడం, కమ్మ సామాజిక వర్గంలో ప్రతికూల ప్రభావం ఉండడం, ఇవన్నీ నివేదికల్లో తేలడంతో జగన్ వంశీని పక్కన పెట్టేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు.

ఇటీవల కొడాలి నానితో కలిసి వంశీ సీఎం జగన్ ను కలుసుకున్నారు. వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. వంశీ వెంట టిడిపి నుంచి వచ్చిన వారు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని జగన్ వంశీ ముఖం మీద చెప్పినట్లు సమాచారం. గన్నవరంలో నీకు వ్యతిరేకత ఉంది.. మరో నియోజకవర్గానికి మారుస్తానని జగన్ చెప్పడంతో వంశీ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. తనకు బలమైన నియోజకవర్గం అని.. మారే ప్రసక్తి లేదని వంశీ తేల్చి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఫోనుకు సైతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. దీంతో వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.