Jagan sensational decision: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్ యాక్షన్ లోకి దిగుతున్నారు. పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి పార్టీ తరఫున పోరాటం తీవ్రతరం చేయనున్నారు. అందులో భాగంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరుకానున్నారు జగన్. ఇంకోవైపు ఈనెల 7న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని జిల్లాల బాధ్యతలను కొంతమంది సీనియర్లకు అప్పగిస్తారని సమాచారం. అందులో భాగంగా ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలను సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. మరో పెద్ద పదవి సైతం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
కాపు ఉద్యమ నాయకుడిగా..
కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం కు( mudragada Padmanabham ) మంచి గుర్తింపు ఉంది. కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆయన సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే తరచూ వివాదాస్పదంగా మారేవారు. అయితే 2014లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో ఉద్యమం హింసాత్మక పరిస్థితులకు దారితీసింది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ కాపులకు ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించినా.. టిడిపి ప్రభుత్వం పట్ల కాపులు వ్యతిరేకంగా మారారు. ఒక విధంగా కాపులు యూటర్న్ కావడానికి ముద్రగడ పద్మనాభం ఒక కారణం. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముద్రగడ పరోక్షంగా పనిచేశారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని విడిచిపెట్టారు ముద్రగడ. అయితే 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు. పవన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అవమానంగా భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
రెండు జిల్లాల బాధ్యతలు..
అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను( deputy CM Pawan Kalyan) ఓడిస్తానని శపధం చేశారు. కానీ ఆయన శపధం నెరవేరలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితం అయ్యారు ముద్రగడ. అయితే ముద్రగడ అనారోగ్యానికి గురైన సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ముద్రగడ. ఒకటి రెండు నెలల్లో ఆయన సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ బాధ్యతలను పూర్తిగా ముద్రగడకు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. కూటమిలో జరుగుతున్న పరిణామాలతో కాపులు మనసు మారుతోందని.. ఇటువంటి సమయంలో ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ యాక్టివ్ అయితే ప్రయోజనం అని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పార్టీ వర్గాలతో చర్చించి ముద్రగడ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కీలక పదవి అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎలాంటి పదవి ఇస్తారో నన్న చర్చ అయితే మాత్రం జోరుగా సాగుతోంది. మరి ఏ పదవి ఇస్తారో చూడాలి.