Instill Morality in Children: వెనుకటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఫలితంగా పిల్లలపై పెద్దల అజమాయిషి ఉండేది. తప్పు చేస్తే దండిస్తారనే భయం పిల్లల్లో ఉండేది. అందువల్లే వెనకటి తరం పిల్లల్లో పెద్దలపట్ల గౌరవం, చదువు పట్ల శ్రద్ధ ఉండేవి. అందువల్లే నాటి తరంలో దారుణాలు అంతగా జరిగేవి కావు. ఘోరాలు అంతగా చోటు చేసుకునేవి కావు. పైగా కుటుంబం మొత్తం ఒకే చోట కలిసి భోజనం చేసేది. పెద్దలు పిల్లలకు నీతి కథలను.. జీవితం మీద సానుకూల దృక్పథాన్ని బోధించేవారు. నాటి కాలంలో పాఠ్యాంశాలు కూడా విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా ఉండేవి.
నేటి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల్లో నైతికత అనేది ఎండమావిలాగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్లు విద్యార్థుల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. దీనికి తోడు ఉమ్మడి కుటుంబాలు అనేవి మాయమైపోయాయి. కాంక్రీట్ జంగిళ్ళలో.. అపార్ట్మెంట్లలో కుటుంబాలు మొదలయ్యాయి. ఎవరికి వారు అన్నట్టుగా సొంత కుంపటి పెడుతున్న నేపథ్యంలో పిల్లలకు కథలు కాదు కదా.. కనీసం నైతికతను పెంపొందించే విషయాలు చెప్పేవారు కరువయ్యారు. ప్రతిది కూడా ఆన్లైన్లో శోధించడం.. ఆన్లైన్లో చూడటం పెరిగిపోయింది. అందువల్లే నేటితరం భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతోంది. కనీసం పక్క వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా నేటి తరానికి లభించడం లేదు. ఇలాంటి క్రమంలోనే పిల్లల్లో ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించాలని విశ్లేషకులు అంటున్నారు.
పెద్దలు పిల్లలకు కథలు చెప్పడం వల్ల వారి మానసిక స్థితి మెరుగువుతుందని అంటున్నారు.. భయానికి గురిచేసే ప్రతికూల కథలు కాకుండా.. దయ, సత్యం, నిజాయితీతో కూడిన ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించే కథలను చెప్పాలని మానసిక విశ్లేషకులు అంటున్నారు. రెండు సంవత్సరాల వయసు ఉన్న వారికి పాటల రూపంలో.. ఐదేళ్ల వయసు ఉన్న వారికి ఊహను ప్రేరేపించే విధంగా వంటి కథలు చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు.. “పంచతంత్రంలో నీతి ఉంటుంది. ఈసఫ్ కథలలో ధర్మం ఉంటుంది. అక్బర్ బీర్బల్ కథలలో నైతికత ఉంటుంది. తెనాలి రామకృష్ణ కథలలో జీవిత సత్యం ఉంటుంది. పురాణాలలో జీవన చక్రం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. పిల్లలు పడుకునే ముందు ఈ కథలు చెప్పడం ద్వారా వారిలో ఆశావాహ దృక్పథం పెరుగుతుందని” మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.
పిల్లల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ను గతంలో చందమామ కథలు పెంపొందించేవి. నేటి కాలంలో అటువంటి పుస్తకాలు రావడం లేదు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ నేటి ఇంగ్లీష్ చదువుల వల్ల పిల్లలకు అవి అర్థం కావడం లేదు. అందువల్ల పెద్దలు చొరవ తీసుకొని.. కాస్త సమయాన్ని కేటాయించి ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించే కథలను చెబితే వారి మానసిక పరిపక్వత బాగుంటుందని.. అది వారిని నీతిమయమైన నడవడిక వైపు పయనింపజేస్తుందని మానసిక విశ్లేషకులు అంటున్నారు.