CM Jagan: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొలది రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టిడిపి,జనసేన పొ త్తుతో దూకుడు కనబరుస్తుండగా.. వై నాట్ 175 అన్న నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారు. జాతీయస్థాయిలో రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ తో పాటు బిజెపి పావులు కదుపుతున్నాయి. ఎన్నికల ముంగిట తమ రాజకీయ ప్రయోజనాలను అనుసరించి నిర్ణయాలు తీసుకొనున్నాయి.
అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి మొహమాటలకు పోకుండా.. బలమైన అభ్యర్థులుగా తేలితేనే టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుండడం విశేషం. ఈ విషయంలో సీనియర్లను సైతం పక్కకు తప్పించేందుకు సిద్ధపడుతుండడం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.
సుమారు 9 మంది మంత్రులకు ఈసారి టిక్కెట్లు దక్కవని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడున్న క్యాబినెట్లో 40 శాతం మందికి ఈసారి టిక్కెట్ల విషయంలో మొండి చేయి చూపుతారని టాక్ నడుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ ప్రారంభమైంది. టికెట్లు ఇవ్వని జాబితాలో తమ పేరు ఉంటుందోనని బెంగ వెంటాడుతోంది. ఇప్పటికే మంత్రులకు జగన్ వర్తమానం అందించారని.. పరిస్థితి మెరుగుపరుచుకోవాలని సూచించారని.. ఈ జాబితాలో కొందరు సీనియర్లు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.