CM Jagan: ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల కంటే మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ లు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని జగన్ భావిస్తున్నారు. వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ మూడు ప్రాంతాల్లో ఎన్నికల ముంగిట భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసిపి భారీ విజయం దక్కించుకుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటీ వైసిపి తన ఖాతాలో వేసుకుంది. అప్పటినుంచి వై నాట్ కుప్పం అన్న స్లోగన్ ప్రారంభమైంది. అక్కడ భరత్ ను జగన్ ఇన్చార్జిగా నియమించారు. ఎమ్మెల్సీని కూడా చేశారు. కుప్పం ప్రచార బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన తన పుంగనూరు నియోజకవర్గంలో కంటే కుప్పం నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈనెల 26న జగన్ కుప్పంలో పర్యటించనున్నారు. కృష్ణా జలాలను కుప్పానికి అందించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు.
పవన్ భీమవరంలో పోటీ దాదాపు ఖాయమైంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన పవన్ గ్రంధి శ్రీనివాస్ చేతుల్లో ఓడిపోయారు. ఇప్పుడు అదే గ్రంధి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. ఎన్నికల్లోపు భీమవరంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల భీమవరం నియోజకవర్గానికి జగన్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గ ప్రజలను వైసీపీ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంపై కూడా జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ సమన్వయ బాధ్యతలను పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు. బీసీ నేత గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ హనుమంత్ రావులకు జగన్ ప్రత్యేకంగా పిలిపించుకొని ఆదేశించారు. మరోవైపు టికెట్ దక్కలేదన్న ఆవేదనతో పార్టీకి దూరమైన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలో చేర్పించుకున్నారు. ఎలాగైనా మంగళగిరిలో నారా లోకేష్ ను మట్టి కరిపించాలన్న ధ్యేయంతో జగన్ ఉన్నారు.ఆ ముగ్గురు నేతల విషయంలో జగన్ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో కావో చూడాలి.