Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : జగన్ ‘సొంత సామాజిక’ న్యాయం

YS Jagan : జగన్ ‘సొంత సామాజిక’ న్యాయం

YS Jagan : మీగడ మాకు..మజ్జిగ మీకు అన్నట్టుంది ఏపీలో జగన్ సర్కారు పరిస్థితి. సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తూ మిగతా సామాజికవర్గాల వారిని అంకెల గారడీ కోసం జగన్ వాడుకుంటున్న తీరు నివ్వెరపోయేలా ఉంది. ఆదాయం వచ్చే కార్పొరేషన్లు, వ్యవస్థలు, సంస్థలను తన సొంత సామాజికవర్గానికి కేటాయించిన జగన్.. మిగతా వర్గాల వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు.  నామినేటెడ్‌ పోస్టులు పంచిపెట్టిన తీరు చూస్తే… సీఎం జగన్ పాటించిన సామాజిక న్యాయం ఏ పాటిదో అర్థమవుతుంది. నామినేటెడ్‌ పోస్టుల్లో 70 శాతం బీసీ, ఎస్సీలకు ఇస్తున్నట్టు జగన్ సర్కారు ప్రకటించింది. కానీ దాని లోతుల్లోకి వెళితే మాత్రం అసలు సిసలైన సామాజిక న్యాయం ఇట్టే కనిపిస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కారు 941 నామినేటెడ్ పోస్టులు కేటాయించింది. అందులో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారికి 742 పదవులు కేటాయించింది. ఇది అక్షరాలా 76 శాతం అన్నమాట. అంటే మిగతా 24 శాతం మాత్రమే ఇతరవర్గాలకు కేటాయించినట్టు స్పష్టంగా అర్ధమైపోతోంది. రాష్ట్రంలో 10 యూనివర్సటీలకుగాను 8 మంది వైస్ చాన్స్ లర్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. అంటే ఇక్కడ 82 శాతం సొంత సామాజికవర్గానికి కేటాయించారన్నమాట. ప్రభుత్వ సలహాదారులు 42 మంది ఉంటే.. అందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 35 మంది. అంటే ఇక్కడ కూడా అస్మదీయులకు 82 శాతం అమలుచేశారన్న మాట. ప్రభుత్వ విప్ పదవులు ఆరుంటే.. అందులో నాలుగు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే ఇచ్చారు. ప్రభుత్వ న్యాయవాదులు 40 మందికిగాను.. 30 మంది ఆ సామాజికవర్గానికి చెందిన వారే.

బలమైన, కీలకమైన కార్పొరేషన్లలో ఏపీఐఐసీ, ఫైబర్‌నెట్‌, డిజిటల్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ, ఏపీఎంఎ్‌సఐడీసీ, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌, పౌరసరఫరాల కార్పొరేషన్‌, సీడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఆప్కాబ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, స్పోర్ట్సు అథారిటీ, ఏపీ మార్కెఫెడ్‌, ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటిని సీఎం జగన్ సొంత సామాజికవర్గానికే అప్పగించారు. రోజా సైతం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. మంత్రిగా ఎంపిక కాక ముందు ఆమెకు =ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించారు.  రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలకు స్థలాల కేటాయింపుతో సహా ఇతర అంశాల్లో ఏపీఐఐసీ పాత్ర చాలా కీలకం. రోజా పదవీకాలం ముగిసిన తర్వాత… ఆ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు.

జయహో బీసీ జపం తప్పించి మరొకటి కనిపించడం లేదు. సామాజిక న్యాయం మచ్చుకైనా కానరావడం లేదు. బీసీల్లోని 139 కులాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఉండేది ఒకేఒక కార్యాలయం.  విజయవాడ గొల్లపూడిలో ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకుని అందులోనే నిర్వహిస్తున్నారు. ఐదారు కార్పొరేషన్లకు కలిపి ఒక అధికారిని నియమించి చేతులు దులుపుకున్నారు. వీరికి విధులు కానీ.. నిధులు కానీ లేవు. నవరత్నాల్లో తమ సామాజికవర్గం వారికి వచ్చే లబ్ధినే కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్టు చూపడమే వీరి ప్రధాన విధి. అయితే వైసీపీలో సామాజిక న్యాయం ఒక ఫార్సుగా మారింది. కానీ దానినే మసిపూసి మారేడుకాయలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కీలక పదవులు, కొలువులు సొంత సామాజికవర్గానికి కట్టబెట్టిన జగన్ మిగతా వర్గాల వారికి తీరని అన్యాయం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో పరిమితమైన కుల కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. వాటికి నిర్థిష్టమైన నిధులు కేటాయించేవారు. ప్రత్యేకంగా విధులు కూడా అప్పగించేవారు. కార్యాలయాల ఏర్పాటుతో పాటు ప్రత్యేకాధికారులు, సిబ్బంది నియామకం చేపట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదో నామ్ కే అన్నట్టు గణాంకాల కోసం కార్పొరేషన్లను విస్తరించారు. కానీ వారికి విధులు, నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఇకకులాల కార్పొరేషన్ల చైర్మన్లకు గౌరవవేతనంతోపాటు  కారు, వసతి, అలవెన్సుల కింద టీడీపీ హయాంలో ప్రతినెలా రూ.2 లక్షలకు పైగా చెల్లించేవారు. వైసీపీ సర్కారు ఈ మొత్తాన్ని చైర్మన్‌కు రూ.80వేలు, డైరెక్టర్లకు రూ.30వేలు మాత్రమే చెల్లిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular