YS Jagan : ఏపీలో వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితం అయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు కొండంత అండగా కనిపించారు.సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లోక్ సభ సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. కానీ రాజ్యసభ స్థానాలకు సంబంధించి 11 మంది సభ్యుల బలం ఆ పార్టీకి ఉంది.వారి ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దగ్గర కావాలన్నది జగన్ ప్లాన్. అయితే ఇప్పటికే చంద్రబాబు కేంద్ర పెద్దలకు దగ్గరయ్యారు. ఎన్డీఏ 3 లో కీలకంగా మారారు.ఈ తరుణంలో రాజ్యసభ సభ్యుల ద్వారా రాజకీయం చేయాలని జగన్ భావించారు. తన అవసరం బిజెపికి వస్తుందని ఆశించారు. అందుకే లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో అడిగిందే తడవుగా జగన్ మద్దతు ప్రకటించారు. ఇదే మాదిరిగా బిజెపి రాజ్యసభలో తన సాయాన్ని అర్థిస్తుందని భావించారు.రాజ్యసభలో బిజెపికి తగినంత బలం లేకపోవడమే అందుకు కారణం. సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది బిజెపి రాజ్యసభ సభ్యులు ఎంపీలుగా పోటీ చేశారు.ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతిపక్షాలు పుంజుకోవడంతో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని భావించి.. బిజెపి రాజ్యసభ సభ్యులను పోటీ చేయించింది. వారు ఎంపీలుగా గెలిచారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే రాజ్యసభలోబిజెపికి బలం తగ్గింది. ఆ బలాన్ని భర్తీ చేసి బిజెపికి దగ్గర కావాలని జగన్ భావించారు.
* ఎన్డీఏకు స్పష్టమైన అధిక్యం
అయితే ఇప్పుడు బిజెపికి సొంతంగానే రాజ్యసభలో బలం ఏర్పడింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోబిజెపి ప్రాతినిధ్యం పెరిగింది.కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నారు.అటువంటి వారి స్థానంలో బిజెపి సభ్యులేరాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతున్నారు.దీంతో బిజెపికి బలం చేకూరుతోంది. రాజ్యసభలో సంపూర్ణ అధిక్యత సాధించింది బిజెపి. దీంతో వైసిపి ఆశలు నెరవేరలేదు. రాజ్యసభ సభ్యులతో రాజకీయం చేయాలని భావించిన జగన్ వ్యూహం ఫెయిల్ అయింది.
* బిజెపికి సొంతంగానే
ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ బలం 119.ఇందులో బిజెపికి సొంతంగా 96 మంది సభ్యులు ఉన్నారు. మిగతావారు మిత్రపక్షాలకు చెందినవారు. రాజ్యసభలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టాలంటే అవసరమైన సాధారణ మెజారిటీ 117. అంటే కావలసిన దానికంటే రెండు సీట్లు అదనంగా ఎన్డీఏకు ఉన్నాయి. దీంతో రాజ్యసభ సభ్యుల ద్వారా బిజెపికి దగ్గర కావాలన్న వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. ఇప్పటినుంచి కేంద్రంలో బిజెపి రాజ్యసభ సభ్యుల పెరుగుదలే కానీ… తగ్గే ఛాన్స్ లేదు.
* టిడిపికి పెరగనున్న బలం
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం.. 165 స్థానాల్లో గెలుపొందడంతో రాజ్యసభ సభ్యుల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీకి బలం తగ్గుతోంది. ఇటీవలే ఆ పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. ఆ పార్టీ బలం తొమ్మిదికి తగ్గింది. అయితే ఇప్పుడు బిజెపి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దక్కించుకోవడంతో.. రాజ్యసభ సభ్యుల ద్వారా బిజెపికి దగ్గర కావాలన్నా జగన్ ప్రభుత్వం ఫలించే అవకాశం లేదు.