YS Jagan: ఏపీలో పరిణామాలపై జగన్ ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈరోజు జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆందోళన చేపట్టనున్నారు. మంగళవారమే జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలు ఢిల్లీ వెళ్లారు. అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం వెళ్లకపోవడం చర్చకు దారితీస్తోంది. ఢిల్లీకి వెళ్లాల్సిన ఆ ఇద్దరు.. శాసనమండలిలో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరూ బుధవారం వెళ్తారా? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఉండిపోయారా? అన్నది తెలియాల్సి ఉంది.కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు కొందరు టిడిపికి టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మరికొందరు సీనియర్లు బిజెపిలో చేరతారని కూడా తెలుస్తోంది. శాసనమండలిలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ అయినట్లు టాక్ నడిచింది. అటు వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావిస్తున్న చాలామంది ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా చాలామంది వైసీపీ ఎమ్మెల్సీలు నిర్లక్ష్యానికి గురయ్యారు. పార్టీకి ఎమ్మెల్యేల రూపంలో అంతులేని మెజారిటీ ఉండడంతో.. ఎమ్మెల్సీలు కేవలం పదవులకు పరిమితం అయ్యారు. పేరుకే ఎమ్మెల్సీలు కానీ నియోజకవర్గాల్లో చేయి పెట్టలేని దుస్థితి వారిది. కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇబ్బందులు పెట్టారు. అప్పట్లో నాయకత్వం సైతం ఎమ్మెల్సీలను నియంత్రించింది. అందుకే ఇప్పుడు ఆ ప్రభావం పడుతోంది. పైగా కొంతమంది ఎమ్మెల్సీలు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించారు. కానీ అవకాశం దక్కలేదు. అటువంటి ఎమ్మెల్సీలు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
* హస్తిన బాట పట్టిన జగన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ జగన్ ఆరోపిస్తున్నారు. అందుకే జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు సిద్ధపడ్డారు. తమ ఆందోళన కార్యక్రమానికి రాజకీయ పార్టీల మద్దతును కూడా కోరారు. అయితే ఇంతవరకు జాతీయ స్థాయిలో ఏ పార్టీ ముందుకు రాలేదు. వామపక్షాల సాయం కోరినా వారు పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. అటు కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ఆందోళనలో పాల్గొంటుందా? లేదా? అన్నది తెలియాలి. అయితే ఢిల్లీలో జరిగే ఆందోళన కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంక రవీంద్రలు కనిపించడం విశేషం. దీంతో ఎమ్మెల్సీలు వేరే ఆలోచనతో ఉన్నారా? అన్న చర్చ ప్రారంభం అయ్యింది.
* వైసిపి వ్యూహానికి ధీటుగా
శాసనసభలో కూటమికి అంతులేని మెజారిటీ ఉంది. 175 స్థానాలకు గాను 164 చోట్ల కూటమి పార్టీలు పాగా వేశాయి. వైసిపి 11 స్థానాలకే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు శాసనమండలిలో ఉన్న బలంతో కూటమిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. తద్వారా శాసనమండలిలో తమదే వైచేయి అని.. కీలక బిల్లులను అడ్డుకుంటామని సంకేతాలు పంపించారు. తద్వారా శాసనమండలిపై పట్టు బిగించేందుకు టిడిపి కూటమి చర్యలు ప్రారంభించింది. ఈ తరుణంలో కొంతమందివైసీపీ ఎమ్మెల్సీల వ్యవహార శైలిలో మార్పు రావడం గమనార్హం.
* ఆసక్తి చూపుతున్న నేతలు
వైసీపీకి ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే ఇందులో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారు కూడా ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను ఎమ్మెల్సీలు చేశారు జగన్. నాడు సామాజిక సమీకరణల పేరిట ఎమ్మెల్సీలను నియమించారు. సాధారణ నేతలకు సైతం అప్పట్లో పదవి వరించింది. అయితే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ.. నిధులు, విధులు లేవు. ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదు. ఇప్పుడు పార్టీ పరాజయం పాలవ్వడంతో చాలామంది ఎమ్మెల్సీలు పునరాలోచనలో పడ్డారు. అధికార పార్టీలోకి చేరిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అధికార కూటమి ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే. కీలక బిల్లులు ఆమోదం కోసం ఉండడంతో కచ్చితంగా.. కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుంది.
* సగం మంది సైడ్?
అయితే ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే క్రమంలో కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో సగం మందిని సైడ్ చేస్తే.. వైసీపీని తప్పించవచ్చని భావిస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కుశ్రీకారం చుట్టినట్లు సమాచారం. తోట త్రిమూర్తులు లాంటి నేత బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్సీలను టిడిపి, జనసేన, బిజెపిలో సమానంగా చేర్పించేందుకు వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. తద్వారా శాసనమండలిలో వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నదే ప్లాన్. ఎమ్మెల్సీలు ఎవరికి వారు ముందుకు వచ్చి కూటమి పార్టీలో చేరేలా ఒక వ్యూహం రూపొందించినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jagans agitation in delhi two ycp mlcs appeared in the legislative council
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com