Jagan: జనంలోకి వచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ అంశంతోనే ప్రజల్లోకి వెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు రానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నుంచి మెడికల్ కాలేజీలపై పోరాటానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. తద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కాకుండా.. ఏపీ రాజకీయాల్లో తన పట్టు తప్ప లేదని చాటి చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే సుదీర్ఘకాలం అదిగో ఇదిగో అంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి… ఎట్టకేలకు జనంలోకి రానుండడం మాత్రం విశేషమే.
* మెడికల్ కాలేజీలపై వార్..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను( government medical colleges) కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే తాము ప్రైవేట్ పరం చేయలేదని.. ప్రభుత్వ పర్యవేక్షణలో.. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో త్వరితగతిన వాటి నిర్మాణం పూర్తి చేసేందుకు మాత్రమే నిర్ణయించామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పుకొస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం చేపడుతున్న మీరు.. 4000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం చేస్తోంది. దీనిపై ప్రజల ఆలోచన మారుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి.. మెడికల్ కాలేజీల అంశంపైనే గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు నర్సీపట్నంను వేదికగా చేసుకున్నారు.
* కొరకరాని కొయ్యగా విశాఖ..
ఉత్తరాంధ్రలో( North Andhra) జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి షెడ్యూల్ రానుంది. ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఆ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. 2014 ఎన్నికల్లో కూడా విశాఖ పట్టు చిక్కలేదు. 2019లో పర్వాలేదనిపించుకుంది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా సీన్ మారిపోయింది. అందుకే అక్కడ పరిస్థితిని చూసిన జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేత బొత్సను తీసుకొచ్చి విశాఖ రాజకీయాల్లో రంగప్రవేశం చేయించారు. అయినా సరే అనుకున్న స్థాయిలో విశాఖ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడడం లేదు. అందుకే నేరుగా రంగంలోకి దిగడానికి నిర్ణయించారు.
* ఏడాదిగా అదే ప్రచారం..
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తారని అంతా భావించారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడం చాలా ఆలస్యం జరిగింది. దీనిపై రకరకాలుగా నెగిటివ్ ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే.. మెడికల్ కాలేజీల అంశాన్ని ఆయుధంగా మలుచుకుని.. ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మరి ఈసారైనా ఆయన బయటకు వస్తారా? లేకుంటే రకరకాల కారణాలతో వాయిదా వేస్తారా? అన్నది చూడాలి.