Tirumala Srivari Pink Diamond: చుట్టూ పచ్చటి ప్రకృతి.. అదట్టమైన అరణ్యం.. అందులో జీవవైవిధ్యం..నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ప్రతిరోజు వేలాదిమంది భక్తుల దర్శనం.. అంతేమందికి అన్నదానం.. ఇదీ శ్రీహరి కొలువై ఉన్న తిరుమల తిరుపతి క్షేత్ర వైభవం. ఈ క్షేత్రం నిత్యం ధూప దీప ఆరాధనతో విరాజిల్లుతూ ఉంటుంది. అశేషమైన భక్తకోటికి ఆధ్యాత్మిక భావనను పంచుతూ ఉంటుంది. నిత్యం భక్తులు విపరీతంగా వస్తూ ఉండడంతో ఈ క్షేత్రం జన సంద్రాన్ని తలపిస్తూ ఉంటుంది.
శ్రీవారికి పూజలు మాత్రమే కాదు.. కానుకలు సమర్పించే భక్తులు కూడా అదే సంఖ్యలో ఉంటారు. బంగారం, వజ్రాలు, రత్నాలు, కెంపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి వద్ద కొన్ని వందల కిలోల ఆభరణాలు ఉన్నాయి. ఆ బంగారాన్ని మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకుల్లో భద్రపరుస్తూ ఉంటుంది. ఆభరణాలలో కొన్నింటిని స్వామి వారికి ధరింపజేస్తుంటారు. ఉత్సవాలు, పండగల సమయంలో స్వామి వారికి ఆభరణాలను ధరింపజేస్తూ.. తిరుమల మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తుంటారు. తిరుమల శ్రీవారికి వెలకట్టలేని ఆభరణాలు చాలా ఉన్నాయి. అందులో పింక్ డైమండ్ అనేది ప్రత్యేకం. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది.
తిరుమల శ్రీవారికి 1945లో మైసూర్ మహారాజు జయచామర రాజేంద్ర వడియార్ పింక్ డైమండ్ సమర్పించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే 2018 కాలంలో శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు. పైగా అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వైసిపి దీనిపై పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది. పింక్ డైమండ్ మాయం విషయంలో నాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించింది. ఈ వ్యవహారం జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపించింది. దీంతో ఈ వ్యవహారంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఇన్నాళ్లకు పింక్ డైమండ్ వ్యవహారంపై అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల దీనిపై అధ్యయనం మొదలుపెట్టింది. అనేక విధాలుగా సమాచారం సేకరించింది. ఆ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం.. అది హారం అని.. అందులో కెంపులు, రత్నాలు మాత్రమే ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ పేర్కొన్నారు.. అంతేకానీ అది పింక్ డైమండ్ కాదని.. పింక్ డైమండ్ శ్రీవారి ఆభరణాల జాబితాలో లేదని ఏఎస్ఐ స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లపాటు మిస్టరీగా ఉన్న పింక్ డైమండ్ వ్యవహారం పై ఒక క్లారిటీ వచ్చింది. అయితే చాలామంది సమర్పించిన ఆభరణాలలో రత్నాలు, కెంపులు, ఇతర అరుదైన లోహాలు మాత్రమే ఉన్నాయని.. అంతేతప్ప అందులో పింక్ డైమండ్ అనేది లేదని ఏఎస్ఐ సర్వేలో స్పష్టమైంది.