Jagan: రాజకీయాల్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. అయితే అది కొంత సమయానికే. అది మితిమీరితే మాత్రం చాలా కష్టం. ఇటువంటి ఉదంతాలు చాలా వరకు చూశాం. అయితే అటువంటి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న వారు ఉన్నారు. కానీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇంకా పాత పద్ధతిలోనే కొనసాగుతున్నారు. రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని ఆయన గమనించడం లేదు. అందుకే జనం అంటే జగన్.. జగన్ అంటే జనం అన్నట్టు ఆయన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్లినా ఆయన జనం జపమే చేస్తున్నారు. జనం లేనిదే తాను బయటకు రాలేనని తేల్చి చెబుతున్నారు.
* జనంతో కూటమి మమేకం..
జగన్ జనం మంత్రాన్ని దాటుకొని వెళ్తోంది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ప్రతి నెల పింఛన్ ఒకటో తారీఖునే అందిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. కానీ ఎక్కడా జనాన్ని నమ్ముకోవడం లేదు. ఏదో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఏదో ఒక ఇంటికి వెళ్లి పింఛన్ అందజేస్తున్నారు. గ్రామం మధ్యలో గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకం అవుతున్నారు. కనీసం ఆయనను చూసి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పిదాన్ని గుర్తించడం లేదు. ఇంకా అదే జన సమీకరణ.. అదే జనం మధ్య రోడ్ షో అంటూ హడావిడి చేస్తున్నారు. ఈ ఆలోచన ముమ్మాటికీ తప్పిదమేనని జగన్మోహన్ రెడ్డిని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.
* ఎప్పుడూ అదే సెంటిమెంట్..
జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి ఒక రకమైన సెంటిమెంటును నమ్ముకున్నారు. అదే కొనసాగింపుగా ఉంటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను అన్యాయం చేసిందని ఓదార్పు యాత్రకు దిగారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణంతో చాలామంది చనిపోయారు. వారందరినీ లెక్క కట్టి ఓదార్పు యాత్రకు దిగారు. అలా తన రాజకీయ పునాదులు వేసుకున్నారు. ఇలా ప్రజల్లోకి వెళ్లే క్రమంలో సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మార్చుకున్నారు. బలమైన పునాదులు తో తొలుత ప్రతిపక్షంగా.. తరువాత అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాటు అధికారాన్ని బాగానే అనుభవించారు. అయితే జనంలో అదే సెంటిమెంట్ ఉంటుందని భావించారు. ఎక్కడికి వెళ్లినా జన సమీకరణ చేశారు. కానీ జనం ఓట్లు వేయలేదు. అయినా గుణపాఠాలు నేర్వలేదు.
* జనం వస్తేనే పోరాటమా?
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది అంటూ ప్రభుత్వం పై గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే దీనిపై పోరాడేందుకు ఇప్పుడు కూడా ఆయన జనాన్ని నమ్ముకున్నారు. నర్సీపట్నం రోడ్ షో లో భాగంగా వెళ్లేందుకు కుదరదని పోలీసులు చెబుతున్నా.. ఆయన వినడం లేదు. రోడ్డు షో మాదిరిగా వెళ్తానని చెబుతున్నారు. ఒకవేళ జరగడానికి జరిగితే అందుకు ఎవరు మూల్యం చెల్లించుకుంటారు? తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు బాధ్యత వహించాలి . బాధ్యత వహించాలి కూడా. పోరాడేందుకు ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరారు. ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు జన సమీకరణ కావాలంటున్నారు. ఇలా జనాన్ని నమ్ముకోవడం కంటే.. జనం తనపై నమ్మకం పెంచుకునేలా చేస్తేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం. లేకుంటే రాజకీయ ఇబ్బందులు తప్పవు.