Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు ఎవరికీ అంతుపట్టడం లేదు. నా రూటు సెపరేటు అన్నట్టుంది ఆయన వ్యవహార శైలి. అధికారంలో ఉన్నప్పుడు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సెలవిచ్చారు. కానీ ప్రజలు పరాజయం చేతిలో పెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ హోదా కోసం అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి.. మీపై పోరాటం చేస్తానంటున్నారు జగన్. అంటే అధికార పార్టీపై పోరాడేందుకు అదే పార్టీ అనుమతి కోరుతున్నారన్నమాట.
* ఇప్పటివరకు తనకోసమే పోరాటం..
ప్రస్తుతం తన కోసమే పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల కోసం పోరాడుతానని చెబుతున్నారు. తమకోసం కూడా పోరాడుకోలేరు.. ఇంకా ప్రజల కోసం ఏం పోరాడుతారు అన్నది ఇప్పుడు ప్రశ్న. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పెడుతోంది కూడా అదే. అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడడమే కాదు.. దమ్ము, ధైర్యం అనే పద ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు చెల్లుబాటు అవుతాయి. కానీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తాము ప్రజల పక్షమేనని భావన వచ్చేలా వ్యవహరించాలి. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెబుతున్నారు జగన్. అంటే ఆయుధం ఇస్తేనే నేను పోరాడుతాను.. లేకుంటే అస్త్ర సన్యాసం చేస్తాను అన్నట్టు ఉంది జగన్ వ్యవహార శైలి.
* చౌకబారు సలహాలు..
సలహాదారులంటే మంచి సలహాలు ఇవ్వాలి కానీ.. ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వడం ఏమిటి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. రాణి హోదాల కోసం ఎందుకు లేనిపోని పంతాలకు పోవడం.. హోదా కావాలని అధికార పార్టీని అడగడం సిగ్గుమాలిన చర్యగా సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హోదాలతో పని లేకుండా.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే. ప్రస్తుతం ఆయన పర్యటనలు కూడా అధికార పార్టీకి ధీటుగా ఉన్నాయి. భారీ కాన్వాయులతో బల ప్రదర్శనకు దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ధైర్యం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం లేకుండా పోతోంది. ప్రజల్లోకి ధైర్యంగా, మరోసారి అధికారంలోకి వస్తాం అన్న ధీమాతో వెళ్తున్నారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీకి వెళ్లి పోరాటం చేయమంటే మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డికి అదే మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.