Jagannana Suraksha : రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష ప్రారంభమైంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా నిర్వహించిన జగనన్న సురక్షను నెల రోజుల పాటు వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు శిబిరాల్లో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. వెనువెంటనే ధ్రువపత్రాలు జారీచేస్తున్నారు. తొలిరోజు 1306 సచివాలయాల పరిధిలో శిబిరాలు నిర్వహించినట్టు రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రకటించారు. ప్రధానంగా 11 రకాల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నెల రోజుల పాటు కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. తొలిరోజు కార్యక్రమం సక్సెస్ కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 11 రకాల ధ్రువపత్రాలు అందించనున్నారు. సాధారణంగా వీటిని పొందాలంటే చాలా రకాల వ్యయప్రయాసలు గురికావాలి. కానీ అసలు రూపాయి చెల్లించకుండానే వీటి జారీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుల, నివాస ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు, ఆదాయ ధ్రువీకరణ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మరణ ధ్రువీకరణపత్రం, మ్యూటేషన్ ఫర్ ట్రన్జేక్షన్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్, వివాహ ధ్రువీకరణపత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్ డేట్, కౌలు గుర్తింపుకార్డులు, కొత్త రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. రేషన్ కార్డుల విభజన, పేర్లు మార్పు వంటి వాటికి అవకాశం కల్పించారు.
కార్యక్రమ నిర్వహణ పక్కాగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే గ్రామ సచివాలయం నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ పర్యవేక్షణకు అధికారులను నియమించింది. మోబైల్ టీమ్ లను సైతం ఏర్పాటుచేసింది. మండలానికి రెండు టీమ్ లు ఏర్పాటుచేశారు. ప్రతీ టీమ్ లో ముగ్గురు అధికారులు ఉంటారు. 24 సచివాలయాల కంటే ఎక్కువ ఉంటే మూడు టీమ్ లు పర్యవేక్షిస్తాయి. అటు ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తారు. ఎన్నికల ముంగిట కార్యక్రమాన్ని జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నెల రోజుల పాటు ప్రజలకు ధ్రువపత్రాలు జారీచేసి..వారి నుంచి సంతృప్తిపొందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
తొలిరోజు జగనన్న సురక్ష కార్యక్రమం వివరాలను వెల్లడిస్తూ మంత్రి మేరుగ నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజల ముంగిటకు పాలనే జగనన్న సురక్ష అంటూ చెప్పుకొచ్చారు. ఒక్క రోజుల్లో సర్టిఫికేట్ల జారీ ఉద్యమంలా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న తపనతోనే జగన్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. పారదర్శక పాలనకు నిదర్శనం జగన్ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం మహోన్నతమైనదన్నారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేసి సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. కాగా జగనన్న సురక్ష శిబిరాలు ఈ నెలాఖరు వరకూ కొనసాగనున్నాయి.