Pawan Kalyan – Chandrababu : బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు అంతకు మించి వ్యూహాలు పన్నాలి.. అమలుచేయాలి. ఇప్పుడు పవన్ చేస్తున్నది అదే. తనకంటూ ఒక వ్యూహంతో ముందుకెళుతున్నారు. ప్రత్యర్థులకు అందని రీతిలో కొనసాగుతున్నారు. పొత్తులు ఉంటాయని ఒకసారి.. విడిగా పోటీచేస్తామని మరోసారి.. ఇలా అధికార పక్షాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సహజంగా టీడీపీ, జనసేన కలవకూడదని భావిస్తున్న వైసీపీ పవన్ వ్యూహాలు పసిగట్టలేక చతికిలపడుతోంది. అయితే పవన్ వ్యూహాన్ని గుర్తించలేక.. అది కాస్తా చంద్రబాబు వ్యూహమంటూ ఆయన ఖాతాలోకి వేస్తోంది. అదే సమయంలో టీడీపీలో చేరుతారన్న నాయకులు జనసేన వైపు.. జనసేన వైపు వస్తారనుకున్న నాయకులు టీడీపీ వైపు వెళుతుండడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు.
ఇక్కడే వైసీపీ ఒక దుష్ప్రచారానికి దిగుతోంది. పవన్ విడిగా పోటీ అన్నది డ్రామా అని.. చంద్రబాబుకు బ్లాక్ మెయిల్ చేసేందుకేనని కొత్త పల్లవి అందుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో తన ప్రతాపం చూపి వీలైనన్ని ఎక్కువ సీట్లు పొందేందుకే పవన్ వారాహి యాత్రకు దిగారని ప్రచారం చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తి, భయాన్ని నింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బలమైన కాపు సామాజికవర్గాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకొని.. చివరి నిమిషంలో చంద్రబాబుతో బేరం కుదుర్చుకుంటారని ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ ఆరోపణను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు.
మరోవైపు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మరో రకంగా ప్రచారం మొదలుపెట్టింది. పవన్ పవర్ షేరింగ్ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరన్నది దాని సారాంశం. మంత్రి పదవులు వరకూ ఒకే. ఎన్ని మంత్రి పదవులు కావాలి? ఏయే శాఖలు కావాలి? అని మాత్రమే చంద్రబాబు పవన్ తో చర్చించారని.. దీనికి పవన్ సైతం ఒప్పుకున్నారని చెప్పడం ద్వారా జనసేనలో ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నది ప్లాన్. అటు కాపు సామాజికవర్గంలో సైతం ఓ కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలన్నది ఒక వ్యూహం.
అందుకే పవన్ సైతం భీమవరం సభలో తేల్చేశారు. నా ఎదుట ఈ కుప్పిగెంతులు కుదరదని హెచ్చరించారు. మీ వెనుక ఉండే పెద్ద మనుషులకు చెప్పండి అంటూ హెచ్చరికలు జారీచేశారు. తనకు అన్నీ తెలుసునని.. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. చాలా స్మూత్ గా, స్పష్టంగా అధికార పక్షానికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవన్ వ్యూహాలు అంతుపట్టక అధికార పార్టీ చతికిలపడుతోంది. పవన్ ను ఎలా నియంత్రించాలో తెలియక మల్లగుల్లాలుపడుతోంది. కానీ పవన్ వి పక్కా వ్యూహాలు అంటూ ఒప్పుకునేందుకు అహం అడ్డు వస్తోంది. అందుకే వాటిని చంద్రబాబు ఖాతాలో వేసే పనిలో పడింది.