Ambati Rambabu: అంబటికి హ్యాండ్ ఇవ్వనున్న జగన్.. సత్తెనపల్లిలో కొత్త నేత?

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసిపి అభ్యర్థులను మార్చేందుకు జగన్ డిసైడ్ అయినట్లు తెలిసిందే. అందులో భాగంగా 11చోట్ల అభ్యర్థులను మార్చి గట్టి హెచ్చరికలే పంపారు.

Written By: Dharma, Updated On : December 15, 2023 3:17 pm

Ambati Rambabu

Follow us on

Ambati Rambabu: రాష్ట్రంలో నోరు పారేసుకునే నేతల్లో మంత్రి అంబటి రాంబాబు ఒకరు. దానిని వైసీపీ నేతలు ఫైర్ బ్రాండ్ అని సంబోధిస్తారు. ఇతర పార్టీ నేతలు మాత్రం రంకెలు వేస్తారంటూ వ్యాఖ్యానిస్తారు. అధినేత జగన్ పై ఎవరు ఏం మాట్లాడినా.. వైసిపి ప్రభుత్వం పై కామెంట్స్ చేసినా.. అంబటి రాంబాబు ఇప్పే స్పందిస్తారు. పదునైన విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ల పై విమర్శలు చేయడంలో ముందుంటారు. ఈ విషయంలో జగన్ కు ఇష్టుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ అంబటికి ఇప్పుడు చిక్కులు వచ్చేలా ఉన్నాయి. టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసిపి అభ్యర్థులను మార్చేందుకు జగన్ డిసైడ్ అయినట్లు తెలిసిందే. అందులో భాగంగా 11చోట్ల అభ్యర్థులను మార్చి గట్టి హెచ్చరికలే పంపారు. ఇక రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అందులో ఓ పదిమంది మంత్రుల పేర్లతో పాటు కీలక ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరీ కీలకంగా అంబటి రాంబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన మార్పు అనివార్యంగా తెలుస్తోంది. దీంతో అంబటి తెగ బాధపడుతున్నట్టు సమాచారం. కొద్దిరోజుల కిందటే త్యాగాలకు సిద్ధపడాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అంబటి సీటుకే ఎసరు రావడంతో పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.

వైసీపీ ఆవిర్భావం నుంచి అంబటి రాంబాబు జగన్ వెంట నడిచారు. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించడంలో ముందంజలో ఉండేవారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా.. 2019 ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మార్చి మరి జగన్ టిక్కెట్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ ను ఓడించారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే జగన్ ఝలక్ ఇవ్వనున్నారని తెలిసి.. ఆవేదనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో అంబటి రాంబాబును గెలిపించిన పార్టీ శ్రేణులను… అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా సమావేశమై అంబటికి టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది. జగన్ ముద్దు.. అంబటి వద్దు అన్న స్లోగన్ బలపడింది. అటు అంతర్గత సర్వేల్లో సైతం అంబటికి టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ శ్రేణులు ఓడిస్తారని తేలింది. దీంతో అంబటి రాంబాబును పక్కకు తప్పించడం మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సత్తెనపల్లి బదులు మరో నియోజకవర్గం నుంచి అంబటికి పోటీ చేయిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ జిల్లా వ్యాప్తంగా అంబటి పై అసమ్మతి ఉంది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓటమి తప్పదని తేలింది. అందుకే ఈసారి అంబటి రాంబాబును ప్రచారానికి వినియోగించుకుంటారని టాక్ నడుస్తోంది. హై కమాండ్ విడుదల చేసే రెండో జాబితాలో తప్పకుండా అంబటి రాంబాబు పేరు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే వైసీపీ ఫైర్ బ్రాండ్లు ఒక్కొక్కరికి హై కమాండ్ షాక్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.