MLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వీధిన పడింది. గత కొద్దిరోజులుగా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాలకు వినోదం పంచుతోంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ వైఖరి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని చెబుతున్న దువ్వాడ.. అందరూ తనలా వీధిన పడడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోలేకపోతున్నారు. భార్యాబిడ్డలపై కేసులు పెట్టరన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. నాలుగు గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాను ఒక నాయకుడినని.. తన కుటుంబ వివాదమే పరిష్కరించుకోలేని స్థితిలో దువ్వాడ ఉండడం విచారకరం. అయితే ఇంత జరుగుతున్నా.. దువ్వాడ శ్రీనివాస్ కు అండగా వైసీపీ నేతలు రంగంలోకి దిగడం లేదు. హై కమాండ్ ఇంతవరకు స్పందించలేదు. తమ పార్టీ నేత కుటుంబం రోడ్డున పడింది.మీడియాకు ఎక్కింది.పార్టీని చులకన చేస్తోంది.ఇవేవీ అధినేత జగన్ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే దువ్వాడ జగన్ కుటుంబం పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. దీటైన సమాధానం చెప్పేవారు. ఎంతలా అంటే జనసేన అధినేత పవన్ కు చెప్పు చూపేటంతగా.కానీ ఇప్పుడు అదే దువ్వాడ కుటుంబ కష్టాల్లో ఉంటే.. జగన్ తన కష్టం కాదన్నట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన కూడా చేయకపోవడం పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. దువ్వాడ ఒక మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయనను నియంత్రించాల్సిన హైకమాండ్ పట్టించుకోవడం లేదు. దీంతో క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తోంది.మంత్రి అచ్చన్న గేట్లు తెరిచిన మరుక్షణం టెక్కలి లో వైసీపీ ఖాళీ కావడం ఖాయం.
* గత మూడేళ్లుగా తతంగం
వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని గత మూడేళ్లుగా శ్రీకాకుళం జనాలకు తెలుసు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారాన్ని చలాయించారు దువ్వాడ. కేవలం కింజరాపు కుటుంబం పై దువ్వాడను ప్రోత్సహించారు జగన్. అధికారాన్ని తలకెక్కించుకున్న దువ్వాడ ఇష్టా రాజ్యంగా చెలాయించారు. చివరకు ఒక మహిళ ట్రాప్ లో పడ్డారు. దువ్వాడ తన ఇంటికి వెళ్లకుండా ఆ మహిళతోనే ఉంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.కానీ పార్టీ కట్టడి చేయలేదు. దువ్వాడ భార్యాబిడ్డల ఆందోళనను గమనించలేదు. కుటుంబ వ్యవహారాన్ని వ్యాపార కోణంలో చూశారు.
* పవన్ కు హితబోధ
ప్రజా జీవితంలో ఉన్న వారి వ్యక్తిగత వ్యవహార శైలిని అందరూ చూస్తారు. అంతెందుకు ఇదే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనరాని మాటలను అన్నారు. హిందూమతం ఏకపత్ని విధానం గురించి మాట్లాడారు. పవన్ ను నీచుడితో పోల్చారు. కానీ అదే పవన్ విడాకులు తీసుకున్నాక.. వారి సమ్మతంతోనే వివాహాలు జరుపుకున్నారు అన్న విషయాన్ని మరిచిపోయారు. పెళ్లి ఈడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని గ్రహించుకోలేక.. వేరే మహిళతో సన్నిహిత్యంగా ఉన్నానన్న విషయాన్ని తానే ఒప్పుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
* సజ్జలే సర్దుబాటు చేసి ఉంటే
అయితే దువ్వాడ కుటుంబ వ్యవహారానికి ముమ్మాటికీ సజ్జలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దువ్వాడ వ్యవహార శైలి పై ఫిర్యాదులు వచ్చాయి. ఆయన భార్య వాణి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్య శరణ్యమని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో ఆస్తులు పిల్లలిద్దరికీ పంపకాలు చేపడతారని.. వైసీపీ టికెట్ మీదేనంటూ చెబుతూ ఇంచార్జ్ పదవి అప్పగించారు. కానీ ఆస్తులు రాయలేదు. ఇచ్చిన ఇన్చార్జి పోస్టు తీసేసారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న వాణిని సముదాయించారు. ఇప్పుడు ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో వాణిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పుడు అదే మహిళతో బహిరంగంగానే తిరగడం ప్రారంభించారు దువ్వాడ. ఇంతటి వివాదానికి సజ్జలే కారణమని వాణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ ఇంతవరకు వైసీపీ నుంచి ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన రాలేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More