Homeఆంధ్రప్రదేశ్‌Jagan Tweet: ఒక్క ట్వీట్ తో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్..

Jagan Tweet: ఒక్క ట్వీట్ తో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్..

Jagan Tweet: దారుణమైన ఓటమి తర్వాత వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కొంతకాలం పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత జనాల మధ్యలోకి రావడం మొదలుపెట్టారు. క్యాడర్లో ధైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఇటీవల వెన్నుపోటు దినం అంటూ ఏపీవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకరకంగా ఇది ఏపీలో వైసీపీకి బలమైన బూస్టర్ ఇచ్చిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకున్నారు. ఇదే తీరుగా నిరసన కార్యక్రమాల జోరు పెంచాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇదే క్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు సాక్షి టీవీ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. అవి సాక్షి టీవీలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్ట్ అరెస్టుకు దారితీసాయి. అమరావతిలో మహిళలపై కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వాటిని నిలువరించడంలో ఆయన విఫలమయ్యారని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళలు ఆరోపించారు. అంతేకాదు ఏకంగా కృష్ణంరాజు, కొమ్మినేని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు నేపథ్యంలో కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. అందులో గతంలో చంద్రబాబు ఆడవాళ్ళపై చేసిన వ్యాఖ్యలను.. ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను.. కుమారుడు నారా లోకేష్ ఆడవాళ్ళతో కలిసి ఈత కోలనులో చేస్తున్న డ్యాన్స్ దృశ్యాలను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేశారు. అంతేకాదు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు. బాలకృష్ణ గతంలో ఆడవాళ్ళపై ఏవిధంగా వ్యాఖ్యలు చేశారో పేర్కొన్నారు. అంతేకాకుండా లోకేష్ ఎలాంటి జుగుప్సాకరమైన వ్యవహారాలకు పాల్పడ్డారో వివరించారు.

జగన్ చేసిన ఈ ట్వీట్ ను వైసీపీ శ్రేణులు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ కూటమి ప్రభుత్వ ప్రజలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారంటూ పేర్కొంటున్నాయి. మరోవైపు కూటమి నాయకులు కూడా జగన్ చేసిన ట్వీట్ కు సరైన స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ” జగన్ కు ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే.. తన సోదరి పరిస్థితి ఏమిటి.. తన మాతృమూర్తి పరిస్థితి ఏమిటి.. ఆయన కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాల సంగతి ఏమిటి.. ఇవన్నీ కూడా చెప్పాలి. వీటిపై మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. జగన్ సిద్ధంగా ఉన్నారా.. ఇప్పటికే జగన్ మీద ఆయన సోదరి ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పగలరా.. షర్మిల మీద ఎలాంటి విష ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా.. జగన్మోహన్ రెడ్డి పత్రికలో షర్మిల మీద ఎలాంటి వార్తలు రాశారో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా” అంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేసిన విధంగానే.. వారు కూడా అలాంటి వీడియోలను కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఒక రకమైన యుద్ధానికి అటు వైసిపి.. ఇది కూటమి నేతలు పాల్పడుతున్నారు. అయితే ఇది ఎక్కడ వరకు దారితీస్తుందనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular