Jagan: రాజకీయ పార్టీలు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. గెలిచేటప్పుడు మెరుగైన పాలన అందించాలి. ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు ప్రజల గొంతు వినిపించాలి. అధికారంలో ఉంటే బాధ్యతగా వ్యవహరించాలి. విపక్షంలోకి వచ్చినప్పుడు అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజలు గుర్తిస్తారు. కానీ ఈ విషయంలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శాసనసభకు హాజరు విషయంలో సతమతమవుతున్నారు. సభకు హాజరు కావాలా? వద్దా? అంటూ సంశయిస్తున్నారు. కానీ సభకు హాజరు కావడమే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. శాసనసభ అనేది ప్రజల గొంతుక అన్న విషయాన్ని మరిచిపోకూడదని గుర్తు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే శాసనసభలో వ్యవహరించిన తీరుతోనే ప్రజా తీర్పు ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 67 స్థానాలతో వైసిపి బలమైన ప్రతిపక్షంగా ఉండేది. చంద్రబాబు సీఎం అయ్యారు. జగన్ విపక్షనేతగా వ్యవహరించారు. అధికార పార్టీకి ధీటుగా వైసిపి సభలో వ్యవహరించింది. ఒకానొక దశలో ఢీ అంటే ఢీ అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది. కానీ టిడిపి గాడి తప్పింది. వైసీపీ నుంచి 23 మంది సభ్యులను బలవంతంగా లాక్కుంది. సభలో విపక్ష నేత జగన్ ను ఇబ్బంది పెట్టింది. అవహేళనలు చేసింది. కనీస గౌరవం ఇవ్వలేదు. సభలో మాట్లాడే ఛాన్స్కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలన్నీ జగన్ పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుభూతి వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. తనకు అడుగడుగునా అవమానాలు జరిగాయని భావించి నాడు జగన్ శాసనసభను బాయ్ కట్ చేశారు.
2019లో వైసీపీ అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. 151 స్థానాలతో తిరుగులేని గెలుపుతో సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ చంద్రబాబు అక్కడే తన చాణుక్యతను ప్రదర్శించారు. సంఖ్యా బలంగా తక్కువగా ఉన్నా.. తొలి రోజు నుంచే సభకు హాజరయ్యారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికను ఆహ్వానించారు. ప్రతిపక్ష నేతగా సభా మర్యాదలను పాటించి.. నాడు సభాపతి కుర్చీపై తమ్మినేనిని కూర్చోబెట్టారు. స్పీకర్ ఎంపికపై మాట్లాడిన చంద్రబాబుకు నాడు వైసీపీ సభ్యుల నుంచి ఎన్నో రకాల అభ్యంతరాలు వచ్చాయి. అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడితో అవి ఆగలేదు. నిండు సభలో మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబు పై వ్యక్తిగత దూషణలు చేసేదాకా పరిస్థితి వెళ్ళింది. అంతకుముందు టిడిపి ప్రభుత్వ వైఫల్యాలు, వ్యక్తిగత విమర్శలు.. వీటన్నింటినీ ప్రజలు చూశారు. చంద్రబాబుపై జాలి చూపారు. మితిమీరిన వ్యాఖ్యలతో వ్యవహరించిన వైసీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను కట్టడి చేయకపోవడంతో జగన్ పై ప్రజల్లో మరో అభిప్రాయం ప్రారంభమైంది. నిండు సభలో విపక్ష నేతల కుటుంబాల గురించి మాట్లాడే సరికి ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇదంతా సభకు హాజరైన కారణంగానే ప్రజలకు తప్పు ఒప్పులు తెలిసాయి.
ఇప్పుడు కూడా జగన్ సభకు హాజరైతే మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసిపికి గెలుపోటములు, జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తెలియనివి కావు. మహా శక్తివంతమైన కాంగ్రెస్ అధినాయకత్వానన్ని ఎదిరించిన అనుభవం, ధైర్యం జగన్ కు ఉంది. సభలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఉంటారు. వారి నుంచి మంచి మాటలు వస్తే ఆహ్వానించాలి. చెడ్డ మాటలు వస్తే అభ్యంతరాలు తెలపాలి. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తప్పుడు కామెంట్స్ వస్తే ఎత్తి చూపాలి. గత ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే తెలుసుకోవాలి. మంచి పనులను విమర్శిస్తే తిప్పికొట్టాలి. అవమానిస్తే తట్టుకొని నిలబడాలి. అప్పుడేప్రజలు మనల్ని గుర్తిస్తారు. బయట సభలు, సమావేశాల్లో మాట్లాడితే.. అది కేవలం పార్టీ శ్రేణులకే వెళ్తాయి. తటస్తులు, మేధావులు, ప్రజల్లో ఒక రకమైన మార్పు రావాలంటే మాత్రం జగన్ తప్పకుండా సభకు వెళ్లి తనను తాను నిరూపించుకోవాలి. జగన్ ఒక్క మాటను గుర్తించుకోవాలి. వైసిపి కేవలం ఓడిపోయింది. పతనం కాలేదు. ఏపీ సమాజంలో 100 మందిలో 40 శాతం మంది వైసీపీకి మద్దతు తెలిపారు అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకు అనుగుణంగా జగన్ వ్యవహార శైలి మార్చుకుంటే.. 2029 నాటికి వైసిపి ఓటు శాతం పెరగడం ఖాయం. పార్టీ నిలబడడం ఖాయం. ఇక తేల్చుకోవాల్సింది ఆయనే.