CM Chandrababu: ఏపీలో ఇద్దరికీ భారతరత్న రానుందా? ఈ మేరకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా? ఆ ఇద్దరి మహనీయులకు అత్యున్నత పురస్కారానికి ప్రయత్నం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం విశేషం. అత్యంత దగ్గర అయిన వారు కూడా. అంతకుమించి అవసరమైన వారు కూడా. రాజకీయంగా వారిపై ఆధారపడి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. వారిలో ఒకరు టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, రెండో వారు మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ లో కీలక భాగస్వామ్యం అయింది. ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. ఎన్డీఏ సుస్థిరతకు టిడిపి అవసరం కీలకంగా మారింది. ఇటువంటి తరుణంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. కేవలం పార్టీ పరంగానే కాకుండా.. ప్రభుత్వపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు ఎంపీలు ప్రయత్నించాలన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీలు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నది చిరకాలంగా వినిపిస్తున్న డిమాండ్. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఎంపీ కావడంతో.. ఆమె తన తండ్రికి భారతరత్న అవార్డు ఇవ్వాలన్న వాయిస్ ను వినిపిస్తున్నారు.
చంద్రబాబును రాజకీయంగా చేయి పట్టించి నడిపించిన ఘనత రామోజీరావు ది. చంద్రబాబు కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఆదుకున్నది ఆయనే. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఎప్పుడు పరోక్ష సహకారం అందిస్తూనే ఉండేవారు రామోజీరావు. అటువంటి రామోజీరావు అకాల మరణం చెందారు. నిన్న ఆయన సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు రామోజీరావుకు భారతరత్న దక్కేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయనకు భారత్ రత్న తీసుకురావడం మన అందరి కర్తవ్యం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏటాఆగస్టులో పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. వీటితో పాటే భారత దేశ అత్యంత పౌర పురస్కారంగా నిలిచే భారతరత్న కూడా అప్పుడే ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రత్నాలు సాధించేందుకు మరో నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ విషయంలో చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే ఒకే రాష్ట్రానికి ఒకేసారి రెండు రత్నాలు ప్రకటించే అవకాశం లేదు. కానీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామ్యం కావడంతో.. కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.