YS Jagan Mohan Reddy: ‘షర్మిల కూతురు వివాహం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో చేయడం కుదరదు. జగన్ కు అత్యున్నత భద్రత ఉంది. పైగా ఆయనకు ప్రాణహాని కూడా ఉంది. అందువల్లే ఆ ప్యాలస్లో వివాహం చేయడం కుదరదు. దయచేసి అర్థం చేసుకోవాలి. జగన్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటున్న నివాసంలో పెళ్లి చేయడం అంటే ఇబ్బందికరమైన పరిణామం. అందువల్లే ఆ ప్యాలెస్ లో పెళ్లికి నిరాకరిస్తున్నారు’. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని చెప్పిన మాటలు ఇవి.
పేర్ని నాని ఆ వ్యాఖ్యలు చేయడాని కంటే ముందు జగన్ ఒక లేఖ రాశారు. తన నివాసంలో నీ కూతురు వివాహం జరగడానికి అవకాశం లేదని షర్మిలకు తేల్చి చెప్పారు. వాస్తవానికి జగన్ కు ప్రాణహాని ఉందా.. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న వ్యక్తికి పెళ్లికి వచ్చిన అతిథులు ప్రాణ హాని కలిగిస్తారా.. ఇందులో నిజం ఉందా.. ఒకసారి లోతుల్లోకి వెళ్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.
నాడు రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా.. ముఖ్యమంత్రి గా. ఉన్నప్పుడు.. ప్రత్యర్థుల నుంచి నాటు బాంబులు.. కత్తులతో ప్రాణాపాయం ఉందని తెలిసినప్పటికీ కుటుంబంలో అందరి వివాహాలు చేశారు. శత్రువులను సైతం నాడు రాజశేఖర్ రెడ్డి వివాహాలకు ఆహ్వానాలు పంపించారు. రాజశేఖర్ రెడ్డి సోదరుల పిల్లలు.. తోడ పుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల వివాహాలు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో జరిగాయి. తమ్ముడు జార్జి రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి పెళ్లి.. సోదరి విమలమ్మ కుమారుడు యువరాజ్ వివాహం.. ఆమె కూతురు దివ్య వివాహం.. బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు రఘుదీప్ వివాహం.. తమ్ముడు వైఎస్ సుధీకర్ రెడ్డి కుమార్తె వేరోనికా రెడ్డి వివాహాలు రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనే జరిగాయి.
వివాహాలను అడ్డం పెట్టుకొని ప్రాణహాని ఉందని నాడు రాజశేఖర్ రెడ్డి భయపడలేదు. పైగా షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికే వెడ్డింగ్ కార్డులో షర్మిల రెసిడెన్సి, బెంగళూరులో వివాహం అని కార్డులు ముద్రించారు. బంధువులకు.. శ్రేయోభిలాషులకు.. సన్నిహితులకు.. ఇతర కుటుంబ సభ్యులకు పంచారు.. అలాంటప్పుడు సెక్యూరిటీ పేరుతో కాబోయే వియ్యంకుల ముందు షర్మిల పరువు తీస్తున్నారని జగన్ మీద కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అత్యంత దగ్గర వ్యక్తులను ఆహ్వానించిన నేపథ్యంలో జగన్ పెళ్లి వేడుకకు అడ్డు చెప్పడం పట్ల వైఎస్ కుటుంబంలో విస్తృతమైన చర్చ నడుస్తోంది.
ప్యాలస్ ప్రాంగణంలో పెళ్లి వద్దని జగన్ రాసిన లేఖ కు ఘాటుగా సమాధానం పంపారు షర్మిల బంధువులు. ఈనెల 25న బెంగళూరులో షర్మిల కూతురు వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రికలో యలహంక ప్యాలస్ అని షర్మిల ప్రస్తావించారు. ఆహ్వాన పత్రిక బయటకు రావడంతో జగన్ తీరుపై మళ్ళీ చర్చ మొదలైంది. షర్మిలా రెడ్డి బంధువులతో పాటు వియ్యంకుల బంధువులకు ఇప్పటికే పెళ్లి కార్డులను పంపిణీ చేశారు. ప్యాలస్ ప్రాంగణంలో షర్మిల గృహంలో పెళ్లి నిశ్చయం చేశారు. జగన్ అభ్యంతరాల వల్ల షర్మిల ఇంట్లో పెళ్లి వేడుక చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై అభ్యంతరాలు చెబుతూ ఇప్పటికే షర్మిలకు జగన్ లేఖ రాశారు. జగన్ చెప్పిన అభ్యంతరాలు తోసిపుచ్చుతూ షర్మిల బంధువులు కౌంటర్ పంపారు.
పెళ్లి చేసుకుంటే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని వాదనపై వారి మండిపడ్డారు. ఉమ్మడి ఆస్తిలో పెళ్లి వేడుకకు అడ్డుపడడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనమామగా ముందుండి పెళ్లి జరిపించాల్సిన జగన్.. మేనకోడలు పెళ్ళికి ఆటంకాలు కల్పించడం పట్ల షర్మిల తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా జగన్ కు భద్రతాపరమైన ఇబ్బంది ఉంటే రెండు రోజులు ప్యాలస్ కు దూరంగా ఉండవచ్చు కదా అని షర్మిల బంధువులు సూచిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆనాటి ఫ్యాక్షన్ రాజకీయ పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులకు.. బంధువుల పిల్లలకు పెళ్లిళ్లు.. శుభకార్యాలు చేశారంటూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ప్రాణహాని ఉందని భయపడుతున్న జగన్.. నాడు తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప పోరాటాలు చేశారా అంటే ప్రశ్నిస్తున్నారు.