Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం నుంచి మంచి పట్టున్న పొలిటికల్ ఫ్యామిలీలు జగన్ వెంట నడిచాయి. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి తో ఉన్న అనుబంధం, ఆపై సామాజిక వర్గ ప్రభావంతో చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కేతిరెడ్డి ఫ్యామిలీ.. వంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలు జగన్ వెంట నడిచాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీలకు ప్రాధాన్యత తగ్గింది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. ఆర్థికంగా కూడా చేయూతను అందించారు. అందుకే ఆది నుంచి జగన్ వెంట నడుస్తున్న ఫ్యామిలీలు దూరమైనట్టు కనిపిస్తోంది.
* సీనియర్ల బాధ అదే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఫ్యామిలీల అండ ఎక్కువ. శ్రీకాకుళం( Srikakulam) నుంచి అనంతపురం వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన కుటుంబాలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్ వద్ద వారికి అనుకున్నంత ప్రాధాన్యం లేదు. ఆ బాధతోనే చాలామంది ప్రత్యామ్నాయం లేక పార్టీలోనే కొనసాగుతూ సైలెంట్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి చెబితే వినరు.. తమ విషయంలో అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు అన్న బాధ వారిలో ఉంది. ఆ కారణంతోనే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చాలా రోజులు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన ఆయన ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి చాలామంది సీనియర్లకు రుచించడం లేదు. తాము జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేస్తే.. తమ త్యాగాలను అస్సలు పట్టించుకోవడం లేదన్న బాధ చాలామంది సీనియర్లలో ఉంది.
* పెద్దన్న పాత్రలో మేకపాటి..
నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి( Raja Mohan Reddy ) రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. అందుకే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని భావించారు. తన ఫ్యామిలీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, కుమారులు గౌతంరెడ్డి, విక్రమ్ రెడ్డి అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగానే పని చేశారు. అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి క్రమేపి ప్రాధాన్యం తగ్గింది. రాజమోహన్ రెడ్డి సూచనలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీలో ఉండడం వేస్ట్ అన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
* తీవ్ర అసంతృప్తిలో ఆళ్ల ఫ్యామిలీ
జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయత కలిగిన కుటుంబం ఆళ్ళ కుటుంబం. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి( Ayodhya Rami Reddy) జగన్ వెంటే అడుగులు వేశారు. ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన నాయకత్వం బలపరిచేందుకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆరాటపడ్డారు. ఎంతగానో కృషి చేశారు. అయితే వారి కృషికి తగ్గ గుర్తింపు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. చివరకు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం జూన్ తో ముగియనుంది. ఆ కుటుంబం సైతం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.