YS Jagan
YS Jagan : ఉత్తరాంధ్ర( North Andhra) వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారా? అధినేత నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఉత్తరాంధ్ర సమన్వయకర్త నియామకం విషయంలో తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కిందట రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. దీంతో విజయసాయిరెడ్డి స్థానంలో కొత్త నేత ఎంపిక అనివార్యంగా మారింది. అయితే రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు అనూహ్యంగా మాజీమంత్రి కురసాల కన్నబాబు పేరును ఖరారు చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
* చాలామంది ఆశావహులు
ఉత్తరాంధ్ర సమన్వయకర్త( North Andhra coordinator ) పదవి కోసం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ధర్మాన సోదరుల పేరు ప్రముఖంగా వినిపించింది. ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. 2019లో గెలిచిన ధర్మాన ప్రసాదరావుకు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదు. విస్తరణలో చోటు కల్పించారు. అయినా సరే అసంతృప్తిగానే తన మంత్రి పదవిని కొనసాగించారు ధర్మాన ప్రసాదరావు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు ఉంటారా ఉండరా అన్న పరిస్థితి కొనసాగుతోంది. కృష్ణదాస్ సైతం మూడు జిల్లాల ను లీడ్ చేయలేరన్నది పార్టీలో వినిపించిన వాదన.
* ఆశలు పెట్టుకున్న బొత్స
మరోవైపు ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవిని ఎక్కువగా ఆశించారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం ఆయన ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. అయితే తనకు ఉత్తరాంధ్ర పదవి ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )రాజీనామా తర్వాత వేగంగా పావులు కదిపారు బొత్స. ఉత్తరాంధ్రలో సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే మూడు జిల్లాల్లో పార్టీ గెలుపు బాధ్యతను చూసుకుంటానని బొత్స జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. ఆపై శాసనమండలలో వైసిపి పక్ష నేతగా కూడా ఉన్నారు. అందుకే ఆయన పేరు పరిగణలోకి తీసుకోలేదు.
* రకరకాల పేర్లు తెరపైకి
ఇంకోవైపు మాజీమంత్రి పేర్ని నాని( perni Nani ) పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడిచింది. అదే సమయంలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరును ఖరారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే మూడు జిల్లాల్లో వైసీపీ నేతలు లేరా? సమన్వయకర్త పదవికి సరిపోరా? అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం గత అనుభవాల దృష్ట్యా తనకు అత్యంత సన్నిహితుడైన కురసాల కన్నబాబుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.