CM Jagan: గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను కలిశారు. వారితో మమేకమయ్యారు. చాలా వర్గాలకు హామీలు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఆయా వర్గాల నుంచి విపరీతమైన సానుభూతి దక్కింది. ఓట్లు కూడా దక్కాయి. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఏకపక్ష విజయానికి ఈ హామీలు దోహదపడ్డాయి.
సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం గడిచింది, రెండు వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఐదేళ్లు పూర్తి కావడంతో ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ సిపిఎస్ రద్దు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు లేవు. సమయానికి జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా వర్గాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వారంతా ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోయారు. దీంతో సరిగ్గా ఎన్నికలకు ముంగిట జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఆ వర్గాల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేసే విధంగా ఉత్తర్వులు ఇచ్చారు.
2014 ముందు నియమించిన ఔట్సోర్సింగ్,కాంట్రాక్టు ఉద్యోగులకే పర్మినెంట్ ఆదేశాలు ఇచ్చారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా 13 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ తాము పర్మినెంట్ ఉద్యోగులుగా మారిపోతామని సంబరపడ్డారు. అయితే పర్మినెంట్ అయింది కేవలం 3,500 మందికి మాత్రమే. మిగతా పదివేల మంది దాకా ఉన్నారు. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. గత ఐదేళ్లుగా తమను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు పర్మినెంట్ చేస్తామని చెప్పి మోసం చేశారంటూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సీఎం జగన్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికైతే సంక్షేమ పథకాలతో ప్రజల అభిమానాన్ని చురగొన్న జగన్.. ఉద్యోగ వర్గాలను మాత్రం చేజేతులా దూరం చేసుకున్నారు.